తెలంగాణ

telangana

'భోపాల్​ దుర్ఘటన' జరిగిన 36 ఏళ్లకు స్మారకం ప్రకటన

భోపాల్​ గ్యాస్​ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం.. స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు ప్రకటించారు మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​. విషాద ఘటన జరిగిన సరిగ్గా 36 ఏళ్లకు ఆయన ఈ ప్రకటన చేశారు. మరోవైపు.. ఈ చీకటి రోజున బాధితులు, వారి కుటుంబసభ్యులు భోపాల్​లో నిరసనలు చేశారు.

By

Published : Dec 3, 2020, 7:31 PM IST

Published : Dec 3, 2020, 7:31 PM IST

CM Chouhan pays tribute to victims of Bhopal gas tragedy
'భోపాల్​ దుర్ఘటన' జరిగిన 36 ఏళ్లకు స్మారకం ప్రకటన

1984 భోపాల్​ గ్యాస్​ దుర్ఘటన జరిగి నేటికి 36 ఏళ్లు. ఈ సందర్భంగా మృతులకు నివాళి అర్పించారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. ఆ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం.. స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించారు​. ప్రపంచంలోని ఏ నగరమూ మరో భోపాల్​లా మారకూడదని ఈ స్మారకం గుర్తుచేస్తుందని ఆయన అన్నారు.

మృతులకు సీఎం నివాళి

అప్పటి ప్రమాదంలో తమ భర్తలను కోల్పోయిన మహిళలకు రూ.1000 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు శివరాజ్.

''1984 డిసెంబర్​ 2-3 తేదీల్లో జరిగిన దుర్ఘటనలో విషవాయువు వెలువడి ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకంగా.. స్మారక చిహ్నం నిర్మిస్తాం. 2019లో (కాంగ్రెస్​ హయాంలో) వితంతువులకు పింఛను నిలిపివేశారు. దానిని పునరుద్ధరిస్తాం.''

- శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి

ఆనాటి భోపాల్​ దుర్ఘటనలో మిథైైల్​ ఐసోసైనేట్​ రసాయనం వెలువడి.. 15 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5 లక్షలమందికిపైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పుడు కరోనా కారణంగా చనిపోతున్నారు. భోపాల్​లో కొవిడ్​తో ఇప్పటివరకు 518 మంది మరణించగా.. అందులో 102 మంది భోపాల్​ దుర్ఘటన బాధితులే.

ఇదీ చూడండి: భోపాల్‌ విషాదాన్ని ఎదుర్కొని.. కొవిడ్‌తో ఓటమి!

ఇదీ చూడండి: భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

బాధితుల నిరసనలు..

భోపాల్​ గ్యాస్​ దుర్ఘటన బాధితుల నిరసన
దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బాధితులు

భోపాల్​ గ్యాస్​ దుర్ఘటన జరిగి 36 ఏళ్లయిన సందర్భంగా.. బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆందోళనలు నిర్వహించారు. డౌ కెమికల్​ ఛైర్మన్​, సీఈఓ జిమ్​ ఫిట్టర్లిన్​ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. భోపాల్​కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, డౌ కెమికల్స్​ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

బాధితుల ఆందోళన

ఇదీ చూడండి:నేటికీ వెంటాడుతున్న భోపాల్ పాపాల్​

ABOUT THE AUTHOR

...view details