తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పాత బట్టలు మీవి.. పంచే బాధ్యత మాది..!' - cloth bank open for poor

బోర్​ కొట్టేసిన పాత బట్టలు.. పిల్లలకు పొట్టిగా అయిపోయిన దుస్తులు.. ఇలా మూలన పడ్డ వస్త్రాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కుప్పులు తెప్పలుగా ఉంటాయి. కొన్ని నెలలు వాటిని బీరువాలో దాచి, ఆ తరువాత ఓ సంచిలో వేసి అటకెక్కించి, బాగా దుమ్ము పట్టాక తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేస్తారు. కానీ,  ఆ పాత బట్టలే ఎందరో పేదలకు శ్రీరామ రక్ష కావొచ్చని భావించాడు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ పోలీసు అధికారి. 'క్లాత్​ బ్యాంక్​'​ పేరిట పాత దుస్తులను సేకరించి అవసరమైనవారికి అందిస్తూ సహృదయాన్ని చాటుకుంటున్నాడు.

cloth bank open for poor people in chhindwara madhyapradesh
'పాత బట్టలు మీవి.. పంచే బాధ్యత మాది..!'

By

Published : Dec 22, 2019, 9:02 AM IST

'పాత బట్టలు మీవి.. పంచే బాధ్యత మాది..!'
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. చలికాలం ఖరీదైన కార్లలో ఎయిర్ హీటర్స్​ పెట్టుకుని రోడ్లపై తిరిగేవారు ఒక వైపు, ఆ రోడ్ల పక్కన చలికి వణికిపోతూ కప్పుకునేందుకు కనీసం దుప్పటిలేక నిద్రించేవారు మరో వైపు. ఇంత భిన్నమైన పరిస్థితుల్లో ఏకత్వం సంగతి పక్కన పెడితే కాసింత మానవత్వం చూపి సాటి మనిషికి కొండంత అండగా ఉండొచ్చని చాటి చెబుతున్నారు మధ్యప్రదేశ్​ చింధ్వాడా వాసి మహేశ్​ భావర్కర్​. వృత్తికి పోలీసు అధికారే అయినా.. పేదల కోసం 'క్లాత్​ బ్యాంక్​'ను ప్రారంభించి మనసున్న ప్రజా సేవకుడయ్యాడు.

పేదలకు అందేలా..

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. ఎందరో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని చింతించాడు మహేశ్. తనకు తోచిన దాంట్లో నలుగురికి సాయపడాలనే ఉద్దేశంతో ఎనిమిదేళ్ల క్రితం ఓ ప్రైవేటు బస్​ స్టేషన్​ పక్కన ఓ చిన్న దుకాణంలో క్లాత్​ బ్యాంక్​ను తెరిచాడు. పాత బట్టలు ఇస్తే పేదలకు ఇస్తామని ప్రచారం చేశాడు.

మహేశ్​ ఆశయానికి మెచ్చి కొందరు స్వచ్ఛందంగా క్లాత్​ బ్యాంక్​ కోసం పని చేసేందుకు ముందుకు వచ్చారు. అక్కడకు రాలేని వారి కోసం ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు. వీధులు, గ్రామాల్లోకి వెళ్లి దుస్తులు తీసుకువచ్చేవారు. వాటిని శుభ్రంగా ఉతికి, ఇస్త్రీ చేసి ప్యాక్​ చేస్తారు. ఆ తరువాత రోడ్లపైనా, మురికి వాడల్లో ఉండే పేదలకు పంచుతారు.

"ఓ కుగ్రామంలో నేనుండేవాడిని. అక్కడ చాలా మంది పిల్లలు, మహిళలకు సరైన బట్టలు ఉండకపోయేవి. అప్పుడు నేను నా కుటుంబ సభ్యులు, స్నేహితులవే కాక నా పాత బట్టలు కూడా తెచ్చి వారికి ఇచ్చేవాడిని. చాలా మంది ఇలా పాత బట్టలు దానం చేయాలనుకుంటున్నారని నాకు తరువాత అర్థమైంది. కానీ వాళ్లకు ఎక్కడ, ఎలా ఇవ్వాలో తెలియక ఇవ్వలేకపోయారు. అలాంటి వారి వారి ప్రాంతాలకు మా వాహనం పంపిస్తాం. ఆ దుస్తులు తీసుకువచ్చి వాహనంలో వెళ్లి పేదలకు పంచుతాం."

-మహేశ్​ భావర్కర్​

నలుగురు మెచ్చిన ఆలోచన

మంచి కోరి ఏదైనా తలపెడితే తప్పకుండా విజయం సాధిస్తారని మరోసారి నిరూపించాడు మహేశ్.​ అందుకే, మహేశ్​ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు స్థానికులు. తమ దగ్గరున్న పాత దుస్తులను క్లాత్​ బ్యాంక్​కు స్వయంగా వచ్చి అందిస్తున్నారు ఎందరో బాధ్యతాయుత పౌరులు.

"ఇవన్నీ మా నవజాత శిశువు బట్టలు, అన్నీ ఉన్ని దుస్తులే.. కొన్ని బాబుకు చిన్నవైపోయిన బట్టలు. నేనైతే చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక వేదిక ఉంటే బాగుంటుందని అనుకునేదాన్ని. ఎందుకంటే మనం చాలా వస్తువులు నిరుపయోగం అనుకుని పడేస్తాం. అదే ఇక్కడకు తెచ్చి ఇస్తే.. కనీసం ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. పడేస్తే ఏమొస్తుంది? చలి కారణంగా ఎందరో పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఈ బట్టల వల్ల వారు వెచ్చదనాన్ని పొంది, ఆరోగ్యంగా ఉంటారు."

-భావన ఠాకూర్​, వస్త్ర దాత

ఇదీ చదవండి:ఆలోచన అదుర్స్​... ప్లాస్టిక్​ వ్యర్థాలతో టీ-షర్టుల తయారీ

ABOUT THE AUTHOR

...view details