అమెరికా అధ్యక్షుడి భార్య, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 'క్లాస్ ఆఫ్ హ్యాపీనెస్'కు హాజరుకానున్నారు. సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి భారత పర్యటనకు విచ్చేస్తున్న ఆమె.. దిల్లీ సర్కారు ప్రవేశపెట్టిన 'సంతోష పాఠాలు' ఎలా ఉంటాయో తెలుసుకోనున్నారు.
కేజ్రీవాల్ ఆలోచన నచ్చి..
2018లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 'క్లాస్ ఆఫ్ హ్యాపినెస్'ను ప్రవేశపెట్టింది. నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనేలా.. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది.
"హ్యాపీనెస్ క్లాసెస్‌తో విద్యావిధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిస్తే.. ఒత్తిడి పోతుంది. మార్కులంటే భయం పోతుంది. చదువే సర్వం కాదు, విలువలు ముఖ్యమని తెలుసుకుంటారు."
- ఓ పాఠశాల ప్రిన్సిపల్
'క్లాస్ ఆఫ్ హ్యాపీనెస్'లో చిన్నారి మనసులను సానుకూల దృక్పథంతో నింపి.. ఆనందమైన జీవితంపైపు అడుగులు వేయిస్తున్నారు ఉపాధ్యాయులు. విద్యార్థుల్లో ఒత్తిడి తీసేసి, ఆసక్తికరమైన కథలు చెప్పి వారిలో విలువలు పెంచే దిశగా కదం తొక్కుతున్నారు.