దిల్లీలో పౌరచట్ట వ్యతిరేక ఆందోళనలు వరుసగా రెండోరోజూ హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. డీసీపీకి గాయాలయ్యాయి.
సీఏఏ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య పరస్పరం రాళ్లదాడి జరిగింది. మౌజ్‌పూర్, జాఫ్రాబాద్ల్లో రెండు ఇళ్లకు నిప్పు పెట్టారు నిరసనకారులు. ఆందోళనలు జరిగే ప్రదేశానికి వెళ్తున్న ఓ ఫైరింజన్‌ను ధ్వంసం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జీ చేశారు.
జాఫ్రాబాద్, మౌజ్‌పుర్, బాబర్‌పుర్ మెట్రో స్టేషన్లను మూసేశారు అధికారులు.
గవర్నర్ ఆదేశాలు
పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించాారు. ఆందోళనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సంయమనం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.