దిల్లీ తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో పోలీసులకు లాయర్లకు మధ్య ఘర్షణ జరిగింది. పార్కింగ్ విషయంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు న్యాయవాదులు ఆరోపించారు.
ఘర్షణలో పోలీసు వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మరో ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి 10 ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు.
దిల్లీలో పోలీసులకు లాయర్లకు మధ్య ఘర్షణ లాయర్ల నిరసన
పోలీసుల కాల్పులు జరపడం వల్లే తమ తోటి వారిద్దరికి గాయాలయ్యాయని లాయర్లు ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా కోర్టు గేటు ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండించిన బార్ అసోసియేషన్.. నవంబర్ 4న దిల్లీలోని అన్ని జిల్లా కోర్టుల ఎదుట ఒక రోజు నిరసనలకు పిలుపునిచ్చింది.
'తీస్ హజారీ కోర్టులో న్యాయవాదులపై జరిగిన క్రూరమైన దాడిని మేం ఖండిస్తున్నాం. గాయపడ్డ లాయర్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ లాయర్‌ను లాకప్‌లో బంధించి తీవ్రంగా గాయపరిచి తమ చేతివాటాన్ని ప్రదర్శించారు పోలీసులు. దీనికి బాధ్యులైన వారిని విధుల నుంచి తొలగించి విచారణ చేపట్టాలి. దిల్లీ లాయర్లకు మేం అండగా ఉంటాం.'--కే.సీ మిట్టల్, దిల్లీ బార్ కౌన్సిల్ ఛైర్మన్.
ఖండించిన పోలీసులు
లాయర్ల ఆరోపణలను పోలీసులు ఖండించారు. కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.