1989..ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారానికి దూరమైన ఏడాది. మూడు దశాబ్దాలు దాటాయి. అధికారం కాదు కదా... ప్రధాన ప్రతిపక్షంగా అయినా నిలవలేని దుస్థితి. ఈ పరిస్థితి మారేదెలా? యోగి ఆదిత్యనాథ్ వంటి శక్తిమంతమైన నేతను ఎదుర్కొనేదెవరు? యూపీ కోటపై జెండా ఎగరేసి... దిల్లీ పీఠానికి బాటలు పరిచేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్న సమాధానం... ప్రియాంక గాంధీ.
కేంద్రం నోటీసులతో మళ్లీ...
ఉత్తర్‌ప్రదేశ్ శాసనఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్లు సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది.
ప్రియాంక పేరు ఈ సమయంలో ఇంతలా మార్మోగడానికి ప్రధాన కారణం... కేంద్రప్రభుత్వం ఇచ్చిన నోటీసులు. దిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది మోదీ సర్కార్. ఈ నేపథ్యంలో ఆమె లఖ్‌నవూకు మకాం మార్చుతారన్న వార్తలు వెల్లువెత్తాయి.
నిజానికి మార్చిలోనే తన నివాసాన్ని యూపీకి మార్చాలని ప్రియాంక ప్రణాళికలు వేసుకున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కానీ లాక్డౌన్ వల్ల వాయిదా పడిందని అంటున్నాయి.
పట్టుకోసం ఆశ
1989 నుంచి యూపీలో నామమాత్రంగా ఉండిపోయింది కాంగ్రెస్. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మినహా పూర్తిస్థాయిలో అధికారం చేపట్టలేదు. కాబట్టి ప్రియాంక పూర్తిస్థాయిలో యూపీ రాజకీయ రణక్షేత్రంలోకి దిగితే... కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు పార్టీ నేతలు.
"రాష్ట్రానికి ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రియాంక గాంధీని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయం రావాల్సిందే. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీల పాలనను చూశారు. 30 ఏళ్ల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన పోటీలో విఫలమవుతోంది. ఈ అంతరాలన్నీ ప్రియాంక గాంధీ ద్వారా భర్తీ అవుతాయి."
-అన్షు అవస్థి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సైతం ఇదే డిమాండ్ వినిపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునరుద్ధరణకు ఉత్తర్‌ప్రదేశ్ ఒక మార్గమని పేర్కొన్నారు. ప్రియాంకను ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
ఆదిలోనే ఎదురుదెబ్బ
2017 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఓటమి మూటగట్టుకుంది కాంగ్రెస్. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపెట్టుకున్నప్పటికీ... కేవలం ఏడంటే ఏడు సీట్లకే పరిమితమైంది.