తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చివరి ఓవర్లో  సర్కారు 'బడ్జెట్​ సిక్సర్' - సమరానికి

అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటాతో ఫోర్ కొట్టిన సర్కారు విపక్షాలను కక్కలేని మింగలేని పరిస్థితిలోకి నెట్టింది. ఇప్పుడు మధ్యంతర బడ్జెట్​ను చివరి ఓవర్లో సిక్సర్​గా మలిచి రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో హోరాహోరీ పోరుకు సమరసంఖం పూరించింది.

మధ్యంతర బడ్జెట్​

By

Published : Feb 1, 2019, 7:16 PM IST

2019 సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్స్​గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి. మోదీ ప్రభంజనం కనుమరుగుయిందనే విమర్శలు. నిరుద్యోగం నలభై ఏళ్ల గరిష్ఠానికి చేరిందనే ఆరోపణలు. మహాకూటమితో సర్కారుకు గట్టి పోటీ తప్పదని సర్వేల ఊహాగానాలు. వీటన్నింటిని ఎదుర్కొని భాజపా ఎన్నికల గెలుపు వ్యూహాలు రచించింది.

కోటాతో మొదలు...

అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో పది శాతం కోటా ప్రకటించి వారి ఓటు బ్యాంకుపై భాజపా దృష్టి పెట్టింది. ఆ బిల్లును పార్లమెంటులో విపక్షాలు వ్యతిరేకించలేని పరిస్థితి కల్పించడంలో సఫలమైంది. వ్యతిరేకిస్తే అగ్రవర్ణాల వ్యతిరేకులుగా ముద్ర పడుతుంది. అనుకూలంగా నిలిచినా ప్రభుత్వానికే లబ్ధి చేకూరేలా మోదీ చాతుర్యం కనబరిచారు.

మధ్యంతర బడ్జెట్​... మధ్యతరగతే టార్గెట్..!

ఊహించినట్లుగానే సర్కారు బడ్జెట్​లో వరాల జల్లు కురిపించింది. పేరుకు మధ్యంతర బడ్జెట్​ అని చెప్పినా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, పింఛనుదారులు, సహా అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా బడ్జెట్​ను రూపొందించి విపక్షాలను ఆశ్చర్యపరచింది. ఆదాయపన్ను మినహాయింపు ప్రకటన వెలువడిన వెంటనే సభ ఒక్క క్షణం పాటు మోదీ నామస్మరణతో మారుమోగింది.

విపక్షాలపై ఎక్కుపెట్టిన ప్రధాన బడ్జెట్​ బాణాలు ఇవే..

⦁ 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్​ధన్​​' పేరుతో పింఛను పథకం ప్రకటన. నెలకు 15 వేలలోపు ఆదాయం ఉన్న కార్మికులు అర్హులు. ఈ పథకం ద్వారా సుమారు 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు లాభం చేకూరే అవకాశం.

⦁ రైతుబంధు తరహాలో 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన' పథకం ప్రకటన. ఐదెకరాలు, అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.ఆరు వేల ఆర్థిక సాయానికి నిర్ణయం.

⦁ కార్మికుల ప్రమాదబీమా పెంపుతో పాటు, కనీస వేతనం ప్రకటన. ఈఎస్​ఐ పరిధి పెంపు.

⦁ ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. వేతన జీవులు, పింఛన్‌దారులకు ఊరట ఇకపై రూ.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు.

⦁ పశువులు, చేపల పెంపకం రంగానికి రూ.750కోట్ల నిధులు. గోసంరక్షణకు 'రాష్టీయ కామధేను ఆయోగ్' పథకం.

⦁ రక్షణ శాఖకు రూ. 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్​ కేటాయింపు. అవసరమైతే మరిన్ని నిధులివ్వటానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన.

బడ్జెట్​పై ప్రత్యేక దృష్టి...

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్​ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా సర్కారు ప్రణాళికలు రచించింది. పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న ఓటు బ్యాంకును మరింత బలపరుచుకునే ప్రయత్నం చేసింది. బడ్జెట్​తో ఓటర్లకు సర్కారు గేలం వేస్తుందని విపక్షాలు ఊహించినప్పటికీ వాటిని తలకిందులు చేస్తూ మోదీ సర్కారు పెద్ద వలే వేసింది. ఆదాయ పన్ను మినహాయింపు, ఈఎస్​ఐ, పింఛను పథకంతో పట్టణ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

మరచినవి...

మధ్యంతర బడ్జెట్​లో అన్ని వర్గాలకు ఊరటనిచ్చినప్పటికీ జౌళీ సంఘాలకు ప్రభుత్వం ఎటువంటి తోడ్పాటు ప్రకటించలేదు. వస్త్ర రంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని గత బడ్జెట్​లలో ప్రకటించిన ప్రభుత్వం ఆ విధంగా ఎటువంటి అడుగులు వేయలేదు.

హోరాహోరీ పోరు ఖాయం..!

సార్వత్రిక ఎన్నికల సమరానికి మహాకూటమి కోల్​కతాలో 'ఐక్యతా ర్యాలీతో' మోదీ సర్కారుకు గట్టి సవాలు విసిరింది. మహాకూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు చివరి ఓవర్లో మోదీ బడ్జెట్​ బాణాలు సంధించారు. ఇక రానున్న ఎన్నికల్లో మహాకూటమి మోదీ ఓటమిని చూపిస్తుందా...లేక మరోసారి నరేంద్ర మోదీ ప్రభంజనం శాసిస్తుందా వేచిచూడాలి...!

ABOUT THE AUTHOR

...view details