పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగుతోన్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పౌర చట్టంపై ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఏ ఒక్క పథకము మతప్రాతిపదికన వివక్ష చూపబోదని స్పష్టం చేశారు.
రామ్లీలా మైదానంలో దిల్లీ అనధికార కాలనీవాసుల యజమాన్య హక్కుల కల్పనపై ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో కాంగ్రెస్, ఇతర పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల హక్కులను హరించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందనే అసత్యాలను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ధైర్యముంటే ప్రభుత్వం చేపట్టే పనుల్లో వివక్షను గుర్తించాలని సవాలు విసిరారు.
ఎన్నికల్లో తనను సవాలు చేయలేక, తన ప్రత్యర్థులు పుకార్లు వ్యాప్తి చేస్తూ.. దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ " పౌరసత్వ చట్ట సవరణ భారత్లోని హిందువులు, ముస్లింలు, ఏ మతానికి సంబంధించిన సంస్కృతిని నాశనం చేయదు. ఇదే విషయం పార్లమెంటులో స్పష్టం చేశాం. పార్లమెంటులో అసత్యాలు పలకకూడదు. దేశంలోని 130 కోట్ల మందికి ఈ చట్టం ఎలాంటి హాని తలపెట్టదు. అంతకు ముందు ఎన్ఆర్సీపై భారీగా అసత్య ప్రచారాలు చేశారు. అది కాంగ్రెస్ హయాంలోనే రూపొందించారు. ఆ విషయం మీకు గుర్తుందా. మేము రూపొందించలేదు. పార్లమెంటు ముందుకు రాలేదు. కేబినెట్ ముందుకు రాలేదు. హిందుస్థాన్ భూభాగంలో ఉన్న ముస్లింలంతా భారతమాత బిడ్డలే. వారి సంస్కృతిని నాశనం చేసే విధంగా ఏ చట్టాన్ని, ఎన్ఆర్సీని తీసుకురాలేదు. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇదీ చూడండి: 'ఆప్' సంపన్నుల పక్షం... భాజపా పేదల పక్షం: మోదీ