తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు లోక్​సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు - nda latesty news

ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో నేడు ప్రవేశపెట్టనుంది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు వర్గాలు సహా... కాంగ్రెస్​, తృణమూల్​ నుంచి బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

citizenship-amendment-bill-tobe-itroduced-in-loksabha
నేడు లోక్​సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు

By

Published : Dec 9, 2019, 5:12 AM IST

నేడు లోక్​సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు

రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో నేడు ప్రవేశపెట్టనుంది.

పొరుగుదేశాల నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు సహా వివిధ వర్గాలకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించారు. 2014 డిసెంబర్‌ కంటే ముందు దేశంలోకి వలస వచ్చిన ఆయా వర్గాలకు ఈ బిల్లు ద్వారా పౌరసత్వం కల్పించనున్నారు. కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దిగువ సభలో ఈరోజు జరిగే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

1955 చట్టంలో ఎన్నో మార్పులు....

2024 లోక్​సభ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్​ఆర్​సీ) చేపట్టాలని భాజపా డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరసత్వ చట్టం-1955లోని నిబంధనలకు ఇది చాలా అతీతం.
ఆ చట్ట నిబంధనల ప్రకారం మతపరమైన దాడులు, హింస కారణంగా ఎవరైనా పొరుగుదేశాల నుంచి పారిపోయి వస్తే వారిని చట్టవ్యతిరేక కాందిశీకులుగా ముద్రవేస్తారు. ఎలాంటి దస్తావేజులు లేకుండా భారత్​కు వచ్చి నిర్ధారిత సమయానికి మించి ఇక్కడే తలదాచుకున్న వారందరినీ.. అక్రమ వలసదారులుగానే గుర్తించేవారు. ఇప్పుడు అలాంటి వారందరికీ భారతీయ పౌరసత్వం కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును 16వ లోక్​సభ 2016లో ఆమోదించగా.. రాజ్యసభ ఆమోదం పొందడానికి ముందే దిగువసభ రద్దయింది. ఫలితంగా ఆ బిల్లు ఆగిపోయింది.

విపక్షాల అభ్యంతరం...

ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ బిల్లులో ముస్లింలతోపాటు, నేపాల్, శ్రీలంక నుంచి పారిపోయి వచ్చే మైనార్టీలను విస్మరించడం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేశ పౌరులను మత ప్రాతిపదికన వేరు చేసి చూడకూడదని భారత రాజ్యాంగం చెబుతున్నప్పుడు కొన్ని మతాల వారికి మాత్రమే పౌరసత్వం కల్పించి, మిగతా వారిని విస్మరిస్తామని చెప్పడం ఎలా చట్టబద్ధమవుతుందని ప్రశ్నిస్తున్నాయి. ఈ బిల్లును దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు సహా బంగాల్​ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకం...

బయటి దేశాలనుంచి వచ్చే వారికి తమ రాష్ట్రాల్లో పౌరసత్వం కల్పిస్తే అక్కడే పుట్టిపెరిగిన తమ తెగల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడుతున్నట్లు అక్కడి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం అక్కడి రాజకీయపార్టీలతో సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇలా పౌరసత్వం పొందిన వారికి ఈశాన్యరాష్ట్రాల్లో స్థానికత కల్పించమని కేంద్రం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన 3 దేశాలనుంచి 31,313 మంది భారత్​కు పారిపోయి వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో హిందువులు 25,447 మంది, సిక్కులు 5,807 మంది, క్రైస్తవులు 56, బౌద్ధులు, పార్శీలు ఇద్దరు చొప్పున ఉండొచ్చని కేంద్ర అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగువసభలోనే చిక్కులు...

ఈ బిల్లు లోక్​సభలో సులువుగా ఆమోదం పొందినా... ఎగువసభలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీకి తగినంత బలం లేని కారణంగా విపక్షాలు సెలక్ట్​ కమిటీకి పంపి పరీక్షించాలని డిమాండ్​ చేసే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై కాంగ్రెస్​ పార్టీ కీలక నేతలు చర్చిస్తున్నారు.

సభ్యులకు విప్​ జారీ చేసిన అధికార, విపక్షాలు!

సోమ, మంగళ వారాల్లో రాజ్యసభలో సవరణ బిల్లుపై చర్చ చేపట్టే అవకాశం ఉన్నందున భాజపా సభ్యులెవ్వరూ గైర్హాజరు కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. సోమవారం నుంచి బుధవారం వరకు ఉభయ సభల ఎంపీలంతా తప్పని సరిగా సభకు హాజరు కావాల్సిందే అని భాజపా మూడు లైన్ల​ విప్​ జారీ చేసింది. రాజ్యసభలో ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ కూడా విప్‌ జారీ చేసినట్లు సమాచారం.

పలు పార్టీల వ్యతిరేకత...

బిల్లును కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, సమాజ్​వాదీ పార్టీ, ఆర్జేడీ, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా చివరి నిమిషంలో తృణమూల్​ మినహా మిగిలిన పార్టీలు మద్దతు పలుకుతాయని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఎగువసభలో భాజపాకు 81, దాని మిత్రపక్షాలైన ఏఐఏడీఎంకేకు 11, అకాళీదళ్​కు 3, లోక్​జన్​శక్తికి 1, జేడీయూకు 6 ఉన్నాయి. బిల్లును వ్యతిరేకించే వారిలో కాంగ్రెస్​కు 46, తృణమూల్​కు 13 స్థానాలున్నాయి. మిగిలిన అన్నిపార్టీలకూ ఏక అంకెలోనే సభ్యులున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే తెరాసకు 6, తెలుగుదేశం, వైకాపాకు ఇద్దరు చొప్పున సభ్యులున్నారు. ఈ 3 పార్టీలు బిల్లుకు మద్దతివ్వడమో, లేదంటే సభ నుంచి వాకౌట్​ చేస్తాయని తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు

ABOUT THE AUTHOR

...view details