తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2 రోజుల్లో పార్లమెంటుకు పౌరసత్వ సవరణ బిల్లు..!

పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. మరో రెండు రోజుల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అయితే.. ఈ బిల్లుపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

citizenship-amendment-bill-gets-cabinet-nod-set-to-be-tabled-in-parliament
2 రోజుల్లో పార్లమెంటుకు పౌరసత్వ సవరణ బిల్లు..!

By

Published : Dec 4, 2019, 6:08 PM IST

Updated : Dec 4, 2019, 9:46 PM IST

2 రోజుల్లో పార్లమెంటుకు పౌరసత్వ సవరణ బిల్లు..!

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు.. ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది కేంద్రం.

కేబినెట్​ సమావేశం అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​.. ప్రతి ఒక్కరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశ ప్రయోజనాల కోసం.. ప్రజలు ఈ బిల్లును స్వాగతిస్తారని అన్నారు.

ముస్లిమేతరులకు, ఎక్కువగా హిందువులకు, భారతదేశంలో నివసిస్తున్న శరణార్థులకు పౌరసత్వాన్ని ప్రతిపాదించే ఈ బిల్లుపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. భాజపా సిద్ధాంతాలకు అనుగుణంగా.. ఈ బిల్లును రూపొందించినట్లు విమర్శిస్తున్నాయి.

జాతి భావన ఉల్లంఘనే: శశి థరూర్​

విపక్ష పార్టీలు కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

పౌరసత్వానికి మతం ఓ కారణం కాదని.. ఇది భారత దేశ ప్రాథమిక భావనను ఉల్లంఘిస్తోందని అన్నారు కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​.

''మతం... జాతీయతను నిర్ధరిస్తుందని ఎవరైతే నమ్ముతారో అది పాకిస్థాన్​ ఆలోచన. వారే పాకిస్థాన్​ను సృష్టించారు. మతం జాతీయతను నిర్ధరించదని... మహాత్మ గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్​, డా. అంబేడ్కర్​లు ఎన్నో సార్లు చెప్పారు. అదే జాతి భావన అన్ని మేం ఎప్పటినుంచో వాదిస్తున్నాం.''

- శశి థరూర్​, కాంగ్రెస్​ ఎంపీ

మతాలతో సంబంధం లేకుండా భారతదేశంలో అందరికీ సమాన హక్కులున్నాయని.. దీని గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు థరూర్​.

మొదట లోక్​సభలో...

మరో 2 రోజుల్లోనే ఈ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

బిల్లును మొదట లోక్​సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇక్కడ అధికార భాజపాకు మెజారిటీ ఉన్నందున సులువుగానే ఆమోదం పొందనుంది. రాజ్యసభలోనూ పెద్దగా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాల్లేవు. తమ అజెండా కోసం ప్రాంతీయ పార్టీలైన బీజేడీ, టీఆర్​ఎస్​, వైఎస్​ఆర్​ కాంగ్రెస్​లు.. అధికార పార్టీకి మద్దతిచ్చేలా భాజపా ఒప్పించగలదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదీ చూడండి:'మూకదాడుల నివారణకు ఐపీసీ, సీఆర్​పీసీలో సవరణ'

అసోం ఎమ్మెల్యేల నిరసన... షా వ్యూహాలు..!

పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం సహా ఇతర సమస్యలపై అసోం ఎమ్మెల్యేలు షేర్మాన్​ అలీ అహ్మద్​, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు... అసెంబ్లీ వద్ద నేలపై పడుకొని నిరసనలు తెలిపారు.

ఈ బిల్లు వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈశాన్య రాష్ట్రాల్లోని పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ భయాలను దూరం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలు, పౌర, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఇటీవల భేటీ అయ్యారు. వారి సందేహాలను నివృత్తి చేశారు.

మోదీ 1.0 హయాంలోనూ ఈ బిల్లును...పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అప్పుడు లోక్​సభలో ఆమోదం పొందిన బిల్లు... రాజ్యసభ గడపదాటలేకపోయింది.

ఈ సారి కొన్ని మార్పులతో, కొత్త రూపంతో బిల్లు పార్లమెంటుకు రానుంది.

భాజపాకు కీలకం..

భాజపాకు ఈ బిల్లు సైద్ధాంతిక ప్రాముఖ్యంతో కూడుకున్నదని.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని రద్దు చేయడం ఎంత ముఖ్యమైన విషయమో, పౌరసత్వ సవరణ బిల్లూ అంతే ప్రాధాన్యం కలిగిన అంశమని అన్నారు.

బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కాషాయ పార్టీ ఎంపీలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని పార్టీ సీనియర్​ నేత, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ చెప్పారు. సమావేశాల్లో అంశాలపై.. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని ఎంపీలకు ఉద్బోధించారు.

ఇదీ చూడండి:ప్రకృతి విపత్తుల హిట్​లిస్ట్​లో భారత్​ నెం.5!

Last Updated : Dec 4, 2019, 9:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details