ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నా... విపక్షాలు ససేమిరా అన్నా.. ఎట్టకేలకు పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం దక్కింది. వ్యతిరేకత వ్యక్తమైనా... మోదీ సర్కారు పంతం నెగ్గించుకుంది. రాజ్యసభలో 125-99 ఓట్ల తేడాతో బిల్లుకు ఆమోదం దక్కింది.
ఛైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరిగిన సభ.. విపక్షాల సవరణలన్నింటినీ తిప్పికొట్టింది. పీడనకు గురై శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి రక్షణ కల్పించడమే తమ ఉద్దేశమని, అంతమాత్రాన ముస్లింలకు ఎలాంటి వేధింపులు ఉండబోవని తేల్చిచెప్పింది. బిల్లుపై దాదాపు ఆరున్నర గంటలపాటు చర్చ జరిగింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఆ తీర్మానాలు ఓటింగులో వీగిపోయాయి.
అది దుష్ప్రచారమే: షా
భారతీయ ముస్లింలు మన దేశ పౌరులుగానే ఇకపైనా ఉంటారని, వారు ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదని చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముస్లింలపై ఎలాంటి వేధింపులు ఉండవని భరోసా ఇచ్చారు. పీడనకు గురై.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ల నుంచి శరణార్థులుగా వచ్చిన మైనార్టీలకు విద్య, ఉద్యోగం, జీవనోపాధి హక్కు కల్పించడమే ప్రతిపాదిత చట్టం ఉద్దేశమని వివరించారు. ఇతర దేశాలకు చెందిన ముస్లింలు భారత పౌరసత్వం కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.