తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శరణార్థులకు పౌరసత్వం.. సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర తెలిపింది. 311-80 ఓట‌్ల తేడాతో పౌరసత్వ సవరణ బిల్లు దిగువ సభ ఆమోదం పొందింది. అర్ధరాత్రి వరకూ బిల్లుపై వాడీవేడిగా జరిగిన చర్చలో.. మతపరమైన వివక్ష బిల్లులో ఉందని విపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం తోసిపుచ్చింది. మోదీ పాలనలో ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు.

CAB
శరణార్థులకు పౌరసత్వం.. సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

By

Published : Dec 10, 2019, 5:06 AM IST

Updated : Dec 10, 2019, 7:19 AM IST

పొరుగునున్న మూడు దేశాల్లో మతపరమైన పీడనకు గురై, శరణార్థులుగా మన దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలన్న కీలక బిల్లుకు లోక్‌సభ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆమోదం తెలిపింది. ఉదయం నుంచి సుదీర్ఘంగా ఏడుగంటల పాటు చర్చ కొనసాగిన అనంతరం సభ ఆమోద ముద్ర వేసింది. ఒక్కో అంశం వారీగా ఓటింగ్‌ నిర్వహించారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటు వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంలో... బిల్లు దిగువసభలో గట్టెక్కింది.

విపక్షాల ఆక్షేపణ..

మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పిస్తున్న ఈ బిల్లుకు సభలో ప్రవేశపెట్టే యోగ్యతే లేదంటూ విపక్షాలు తొలుత గట్టిగా ఆక్షేపించాయి. బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు ఆవేశకావేశాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ సభ్యుడు సౌగతారాయ్‌, ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 మంది, వ్యతిరేకంగా 82 మంది ఓటు వేశారు. తొలి గంటలో ఉన్న ఆవేశం తర్వాత తగ్గింది. వాద, ప్రతివాదనలు తలెత్తినా మొత్తానికి బిల్లుపై చర్చ పార్లమెంటు గౌరవాన్ని పెంచేలా సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అంశాల వారీగా విమర్శలన్నింటికీ బదులిచ్చారు. సభ లోపల, బయట కూడా విపక్షాలు నిరసనలు తెలిపాయి. ఎన్డీఏ పక్షాలతోపాటు ఆ కూటమిలో లేని వైకాపా, బీజేడీ బిల్లుకు అండగా నిలిచాయి.

పీడనకు గురైన వారికి హక్కులు వస్తాయి

పౌరసత్వ సవరణ బిల్లుకు దేశంలోని 130 కోట్ల మంది పౌరుల మద్దతు ఉందని అమిత్‌ షా ఉద్ఘాటించారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమన్న వాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అందులో 0.001 శాతమైనా వాస్తవం లేదన్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో మతపరమైన పీడనకు గురైనవారికి నిజానికి ఇప్పుడు హక్కులు లభిస్తాయని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలూ భయపడాల్సిన అవసరమేమీ లేదన్నారు.

మన్మోహన్, అడ్వాణీ అక్కడి వారే..

'ఈ బిల్లు ఏ ఒక్కరి హక్కుల్నీ హరించదు. ఎవరిపైనా వివక్ష చూపదు. చొరబాటుదారులు, శరణార్థులను మనం వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. మూడు పొరుగు దేశాల్లో మతపరమైన పీడనను ఎదుర్కొని 31.12.2014లోగా మన దేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు వద్ద రేషన్‌కార్డులు వంటి ఆధారపత్రాలేవీ లేకపోయినా ప్రతిపాదిత చట్టం ద్వారా వారికి పౌరసత్వం మంజూరు చేస్తాం. గతంలోనూ మన దేశం ఈ విధంగా చేసింది. ప్రధానిగా చేసిన మన్మోహన్‌సింగ్‌, ఉప ప్రధానిగా సేవలందించిన ఆడ్వాణీ ఇలా పాకిస్థాన్‌ నుంచి వచ్చినవారే. రాజ్యాంగంలోని ఆరో అధికరణలో చేర్చి ఉన్న అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు ప్రతిపాదిత చట్టం వర్తించదు' అని షా వివరించారు. శరణార్థులుగా వచ్చి మన దేశంలో ఐదేళ్లుగా నివాసం ఉంటున్న వారికి పౌరసత్వం వస్తుందన్నారు. దేశాన్ని మత ప్రాతిపదికన కాంగ్రెస్‌ పార్టీ విభజించిందని, అందువల్లనే ఈ బిల్లు అవసరమైందని హోంమంత్రి చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా సహేతుకమైన వర్గీకరణలు చేశాకే బిల్లు తీసుకువచ్చామని వివరించారు.

అనుకూలంగా తెదేపా, వైకాపా... వ్యతిరేకంగా తెరాస

బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీ(యు), లోక్‌ జనశక్తి (ఎల్‌జేపీ)తో పాటు ఆ కూటమిలో లేని తెదేపా, వైకాపా, శివసేన, అకాలీదళ్‌, బిజూ జనతాదళ్‌ (బీజేడీ) వంటివీ మద్దతు తెలిపాయి. కొన్ని అంశాలపై తమ పార్టీకి ఉన్న అభ్యంతరాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. లౌకికవాదానికి ఈ బిల్లు వ్యతిరేకమేమీ కాదని జేడీ(యు) స్పష్టంచేసింది. తెరాస, ఎంఐఎం సహా పలు పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి.

రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాలు

ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష నేతలు అధీర్‌ రంజన్‌ చౌధురి, సౌగతారాయ్‌, ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్‌, గౌరవ్‌ గొగొయి, శశిథరూర్‌, మనీష్‌ తివారీ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బిల్లును వ్యతిరేకించేవారంతా హిందూ వ్యతిరేకులన్నట్లుగా చిత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధీర్‌ ఆరోపించారు. రాజ్యాంగ పునాదుల్ని బలహీనపరిచి, హిందూ దేశాన్ని నెలకొల్పేందుకు అడుగులు పడుతున్నాయన్నారు.

బిల్లు ఆమోదం పొందితే మహాత్మాగాంధీ ఆలోచనలపై మహ్మద్‌ ఆలీ జిన్నా ఆలోచనలు విజయం సాధించినట్లవుతుందని శశిథరూర్‌ అన్నారు. ముస్లింలంతా అభద్రతకు గురవుతున్నారని సుప్రియా సూలే (ఎన్సీపీ) చెప్పారు. బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు సముదాయం లోపల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Last Updated : Dec 10, 2019, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details