కొవిడ్-19(కరోనా వైరస్)ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపునిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే.. వారి హాజరు వివరాలను రిజిస్టర్లో పొందుపరచాలని సూచించింది. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.
అప్రమత్తమైన యూజీసీ...
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు చేపట్టింది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). విశ్వవిద్యాలయాల్లో భారీ కార్యక్రమాలను నిర్వహించొద్దని సూచించింది. వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిసిన విద్యార్థులు, అధ్యాపకులను 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని పేర్కొంది.
"క్యాంపసుల్లో భారీ కార్యక్రమాలను నిర్వహించొద్దు. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి వచ్చినట్లు తెలిసినా.. కరోనా సోకిన వ్యక్తులను గత 28 రోజుల్లో కలిసినట్లు తేలితే.. వారిని ఇంట్లో 14 రోజుల పాటు నిర్బంధించి పరిశీలించాలి."
- రజనీశ్ జైన్, యూజీసీ కార్యదర్శి