ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ కంచుకోటల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటి. 15 సంవత్సరాల అధికారం. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనున్న 11 ఎంపీ స్థానాల్లో 10 గెలుపు. ఇది భాజపా విజయ ప్రస్థానం.
2018 విధానసభ ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. పార్టీ ఘోరపరాజయం చూసింది. ఆత్మపరిశీలనలో పడింది అధినాయకత్వం. ఈసారి కంచుకోటలో తిరిగి పాగా వేయాలనుకుంటోంది. అందుకే... సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎంపీలు అందరినీ ఈసారి పక్కనబెట్టి... కొత్తవారిని రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. ఇందుకు భాజపా చెప్పే కారణం... ప్రజావ్యతిరేకతను అధిగమించడం.
ఈ నిర్ణయం వల్ల ఆ పార్టీ నష్టపోతుందని కొందరు, వ్యూహాత్మక అడుగులు వేస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి :భారత్ భేరి: "గౌరవం"పై రాజకీయ దుమారం
తిరుగుబాటు భయం లేదా?
భాజపా ఈ 'మార్పు' నిర్ణయానికే కట్టుబడి ఉంటే రాష్ట్రంలో భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుందన్నది నిపుణలు అంచనా. టికెట్ రాని సిట్టింగ్‌లంతా పార్టీకి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగితే మొదటికే మోసం వస్తుంది. ఓట్ల చీలికతో పరాజయం మూటకట్టుకోవాల్సి ఉంటుంది.
అలా కాకుండా వీరంతా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా, ప్రచారంలో పాల్గొనకుండా ఉండే అవకాశం ఉంది. అలా జరిగినా పార్టీ వెనుకబడే ప్రమాదముంది.