తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ ప్రగతివైపు.. రాజ్యాంగ నిర్దేశపు అడుగులు

రాజ్యాంగ రచనలో ఎందరో కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగ నిర్మాణం సాగిన రీతి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మహామహుల కృషికి చిహ్నం భారత రాజ్యాంగం.

దేశ ప్రగతివైపు.. రాజ్యాంగ నిర్దేశపు అడుగులు

By

Published : Nov 26, 2019, 2:38 AM IST

ఎన్నెన్నో విశిష్ట లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం. దాదాపు మూడేళ్లపాటు సాగిన రాజ్యాంగ రచనలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు? మహామహుల కృషి ఏ రీతిన సాగింది? అనేవి కీలకాంశాలు.

రాజ్యాంగ పరిషత్​ ఆవిర్భావం..

భారత్​లోని రాష్ట్రాల శాసనసభలకు తొలుత ఎన్నికలు నిర్వహించి.. తర్వాత రాజ్యాంగ పరిషత్​ సభ్యులను ఎన్నుకుంటామంటూ 1945 సెప్టెంబర్​ 19న ఆకాశవాణి (ఆల్​ ఇండియా రేడియో)లో నాటి గవర్నర్​ జనరల్​ లార్డ్​ వేవెల్​ ప్రకటనతో రాజ్యాంగ పరిషత్​ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. 1946 డిసెంబర్​ 6న రాజ్యాంగ పరిషత్​ ఆవిర్భావం జరిగింది. ఎన్నికైన ప్రముఖుల్లో జవహర్​లాల్​ నెహ్రూ(భారత జాతీయ కాంగ్రెస్​), బాబూ జగ్జీవన్​రామ్​(కార్మిక వర్గం), మహమ్మద్​ అలీ జిన్నా(ముస్లింలీగ్​), డాక్టర్​ బి.ఆర్​.అంబేడ్కర్​ (షెడ్యూల్డ్​ కులాలు), శ్యామా ప్రసాద్​ ముఖర్జీ, ఎం.ఆర్​.జయకర్​ (హిందూ మహాసభ), సర్వేపల్లి రాధాకృష్ణన్​, సరోజినీనాయుడు తదితరులున్నారు. తెలుగు నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయ్​ దేశ్​ముఖ్​, కళావెంకట్రావు, కల్లూరి సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్​.జి. రంగా, బొబ్బిలి రామకృష్ణరంగారావు ఎన్నికయ్యారు.

రాజేంద్రప్రసాద్​ నేతృత్వం...

రాజ్యాంగ పరిషత్​ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్​ బాబూ రాజేంద్రప్రసాద్​, ఉపాధ్యక్షులుగా హెచ్​సీ ముఖర్జీ, కృష్ణమాచారి, న్యాయ సలహాదారుగా బి.ఎన్​.రావు ఎన్నికయ్యారు.

అంబేడ్కర్​ సారథ్యం...

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947 ఆగస్టు 29న డాక్టర్​ బి.ఆర్​. అంబేడ్కర్​ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటైంది.
రాజ్యాంగం రూపకల్పన ఇలా...

1946 డిసెంబర్​ 9..

జేబీ కృపలానీ ఆధ్వర్యంలో పార్లమెంటులోని రాజ్యాంగ(సెంట్రల్​) హాల్​లో రాజ్యాంగ పరిషత్​ తొలి సమావేశం జరిగింది. పరిషత్​ తాత్కాలిక అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తమకు ప్రత్యేక దేశం, ప్రత్యేక రాజ్యాంగ పరిషత్​ కావాలని డిమాండ్ చేస్తూ ముస్లింలీగ్​ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

1947 జనవరి 22..

రాజ్యాంగ మౌలిక నియమాలను విశదీకరిస్తూ రూపొందించిన 'లక్ష్యాలు-ఆశయాలు' తీర్మానాన్ని జవహర్​లాల్​ నెహ్రూ ప్రవేశపెట్టారు. 1947 జనవరి 22న ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.

1948 ఫిబ్రవరి 21...

ముసాయిదా రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 8 అనుబంధాలతో ప్రచురించి రాష్ట్ర శాసనసభలకు, పత్రికలకు ఇచ్చారు. ముసాయిదా రాజ్యాంగంపై ప్రజలు తమ అభిప్రాయాలు పంపేందుకు 8 నెలల సమయం కేటాయించారు. 1948 నవంబర్​ 4న పరిషత్తు సమావేశమై చర్చను ప్రారంభించింది.

1949 నవంబర్​ 26..

2వేల సవరణల అనంతరం ప్రజాభిప్రాయాలకు పట్టంకడుతూ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది.

1950 జనవరి 24...

రాజ్యాంగ సభ చివరి సమావేశం నిర్వహించి రాజ్యాంగానికి పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపారు. ఏక పౌరసత్వం, రాష్ట్రపతి, స్పీకరు, ఉప స్పీకరు పదవులు, ప్రొవిజినల్​ పార్లమెంటు తక్షణం అమల్లోకి వచ్చాయి.

1950 జనవరి 26...

భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం.

ABOUT THE AUTHOR

...view details