యూపీఏ పదేళ్ల రిమోట్ కంట్రోల్ పాలన కారణంగా దేశంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గడిచిన ఐదేళ్లుగా ఎన్డీఏ పాలనలో దేశం గొప్ప పురోగతి సాధించిందని తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్ శక్తి సామర్థ్యాలు తెలిశాయని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర అహ్మద్ నగర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి దేశ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.
దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఎన్సీపీని స్థాపించిన శరద్ పవార్, ఇప్పుడు దేశానికి ఇద్దరు ప్రధానులు కావాలన్న కొందరి డిమాండ్‌పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు మోదీ.
" ప్రపంచ దేశాలు భారత్‌ను మహా శక్తిమంత దేశంగా గుర్తించాయి. అధికారంలోకి ఎవరు రావాలో మీరే నిర్ణయించాలి. నిజాయితీపరుడైన ఈ చౌకీదారా లేక అవినీతిపరులైన వారసులా? హిందుస్థాన్ హీరో రావాలా? లేక పాకిస్థాన్ సానుభూతిపరులు రావాలా? గత ఐదేళ్లుగా చౌకీదార్ పాలన చూస్తున్నారు. బాంబు దాడులు ఎక్కడైనా జరుగుతున్నాయా? కాంగ్రెస్-ఎన్సీపీ ఎలాంటి వారితో చేతులు కలిపారంటే... జమ్ముకశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి, వారికి ప్రత్యేక ప్రధాని కావాలనే వారికి మద్దతిచ్చినట్టే."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితులపై ఆదాయ పన్ను శాఖ దాడులను ప్రస్తావిస్తూ... ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ తుగ్లక్ రోడ్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు మోదీ.
ఇదీ చూడండి:'ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే'