'ఆధారాలిస్తేనే సీబీఐ కస్టడీకి మాజీ సీపీ!' కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను కస్టడీకి అప్పగించాలని కోరేందుకు తగిన సాక్ష్యాలు సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. శారదా కుంభకోణం కేసులో రాజీవ్ నిర్బంధ విచారణ తప్పనిసరని నిరూపిస్తేనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేసింది.
బంగాల్లో దుమారం రేపిన శారదా కుంభకోణం కేసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాజీవ్ సారథ్యం వహించారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేశారన్నది ఆయనపై ఆరోపణ.
సుప్రీంకోర్టు ఆదేశాలతో శారదా కుంభకోణం కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాజీవ్ పాత్రపైనా ఆరా తీస్తోంది. విచారణలో రాజీవ్ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరింది.
కస్టడీకి అప్పగించాలని కోరేందుకు అవసరమైన సాక్ష్యాలను బుధవారం సమర్పిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: కేంద్రం, ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు