లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న కేంద్ర మంత్రి, బిహార్ నేత రాంవిలాస్ పాసవాన్ గడ్డం పెరిగిపోయింది. క్షవరశాల(హేర్ సెలూన్)లు మూతబడిన నేపథ్యంలో.. ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ సహాయం తీసుకున్నారు. ఫలితంగా చిరాగ్ ట్రిమ్మర్‌తో గడ్డాన్ని ట్రిమ్ చేశారు. ఆదివారం ఈ వీడియోను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు.
తండ్రికి గడ్డం పెరిగితే కుమారుడే దిక్కయ్యాడు
దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు తప్ప అన్ని షాప్‌లు బందయ్యాయి. ఈ నేపథ్యంలో క్షవరశాల(హేర్ సెలూన్)లూ మూతబడ్డాయి. అయితే ప్రస్తుతం పురుషులు జుట్టు, గడ్డం పెరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై నెట్టింట చర్చ నడుస్తోంది. తాజాగా కేంద్రమంత్రికి ఇదే సమస్య ఎదురైతే ఓ పరిష్కారంతో దాన్నుంచి బయటపడ్డారు.
" నాకు ఈ నైపుణ్యం ఉందని ఇప్పటివరకు తెలియదు. ఇది కష్టకాలమే.. అయినా కరోనాపై పోరాడదాం. అలాగే మంచి జ్ఞాపకాలను సృష్టించుకుందాం" అని వీడియోకు వ్యాఖ్యను చేర్చారు చిరాగ్. దీనిపై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ల బాధలు చెప్పుకుంటూ సరదాగా ట్వీట్లు చేస్తున్నారు.
లాక్‌డౌన్ కాలంలో పలువురు సెలబ్రిటీలు తమ ఇష్టమైన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. కొందరు వంట పనులు, వ్యాయామాలు చేస్తూ వాటి వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుని అభిమానులకు మరింత చేరువవుతున్నారు.