బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన తండ్రిని కావాలనే అవమానించేవారని దివంగత నేత రాంవిలాస్ పాసవాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) అధినేత చిరాగ్ పాసవాన్ ఆరోపించారు. దీనికి సంబంధించి తన తండ్రి మరణించడానికి కొన్ని గంటల ముందు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఆయన నితీశ్ తీరుపై పలు ఆరోపణలు చేశారు. తాజాగా ఆ లేఖ వెలుగులోకి వచ్చింది. ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..
'నితీశ్ కుమార్.. నా తండ్రిని అవమానించారు' - బిహార్ రాజకీయాలు
బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్. తన తండ్రి రాం విలాస్ పాసవాన్‌ను నితీశ్ కావాలనే అవమానించేవారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో తన తండ్రి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయం ఎల్‌జేపీ మద్దతుదారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు. తన తండ్రికి అంత అవమానం జరిగినా..కూటమి నిబంధనలు గౌరవించి తాను, పార్టీ కార్యకర్తలు ఎలాంటి విమర్శలు చేయలేదని చిరాగ్ అన్నారు.
'2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సీట్ల పంపకంలో భాగంగా అప్పటి భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, నా తండ్రి రాంవిలాస్ పాసవాన్, నేను ఆ సమావేశంలో పాల్గొన్నాం. రాజ్యసభ సీటు ఎల్‌జేపీకి కేటాయించాలని దానిలో నిర్ణయించారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో నితీశ్ నా తండ్రిని అవమానించారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. అసలు ఆ అభ్యర్థిత్వాన్ని నితీశ్ కుమార్ సమక్షంలో అమిత్ షానే ప్రకటించారు' అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేసే సమయంలో కూడా తన తండ్రితో నితీశ్ ప్రవర్తన సరిగా లేదని విమర్శించారు. నామినేషన్ వేసేటప్పుడు వెంట రమ్మని ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆయన పట్టించుకోలేదని, చివరికి నామినేషన్ ప్రక్రియ పూర్తయి తర్వాత నితీశ్ వచ్చారని అప్పటి సంగతులను ప్రస్తావిస్తూ ఆ లేఖలో మండిపడ్డారు. ఈ విషయం ఎల్‌జేపీ మద్దతుదారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు. తన తండ్రికి అంత అవమానం జరిగినా..కూటమి నిబంధనలు గౌరవించి తాను, పార్టీ కార్యకర్తలు ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు.
అలాగే సెప్టెంబర్ 24న మీడియా సమావేశంలో విలేకరులు తన తండ్రి ఆరోగ్యం గురించి నితీశ్‌ను అడగ్గా ఆయన తెలియదనడం.. చాలా ఆశ్చర్యమేసిందన్నారు. 'ఆ సమాధానం నన్ను షాక్‌కు గురిచేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారు నా తండ్రి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నాకు ధైర్యం చెప్పారు. ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఫోన్ చేసి మాట్లాడారు' అని అన్నారు. కాగా, గురువారం అనారోగ్యంతో కన్నుమూసిన రాంవిలాస్ పాసవాన్ అంత్యక్రియలు శనివారం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. చిరాగ్ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.