కరోనా మహమ్మారి మూలాలు భారత్, బంగ్లాదేశ్‌లలో ఉన్నాయంటోన్న చైనా పరిశోధన అత్యంత లోపభూయిష్టమని భారత్ ఖండించింది. పేలవంగా సాగిన ఈ పరిశోధన, శాస్త్రీయ సమీక్షకు నిలువలేదని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ ముండే స్పష్టం చేశారు. కరోనా వైరస్‌కు మూలం భారత్ అంటున్న ఈ పరిశోధన వివరాలను తాను చదివానని.. ఆ విశ్లేషణ అత్యంత ఘోరంగా ఉందన్నారు. లాన్సెట్‌లో ప్రచురించిన ఈ పరిశోధనను సమగ్రంగా సమీక్షించనే లేదని ఆయన ఎత్తిచూపారు.
భారత్‌లో మనుషులు, కోతుల సాహచర్యం అధికమన్న చైనా ఆరోపణకు కొవిడ్ వైరస్‌కు ఏ సంబంధం లేదని డాక్టర్ ముండే స్పష్టం చేశారు. ఇందుకు వారు చూపిన ఆధారాలు, అనుసరించిన విధానాలు శాస్తప్రమాణాలకు అనుగుణంగా లేవన్నారు. విస్తృత పరిధిలో కాకుండా.. పరిమిత గణాంకాల ఆధారంగా సాగిన ఈ పరిశోధన మొత్తం అవకతవకలే అని రుజువవుతోందని శాస్త్రవేత్త అన్నారు.