గల్వాన్ లోయలో భారత సైనికుల మృతికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని చైనా సామాజిక మాధ్యమాలు విచాట్, సినో వీబోలు తొలగించించాయి. ఈ విషయాన్ని బీజింగ్‌లోని రాయబార కార్యాలయం తెలిపింది. ఇదే అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవస్తావ చేసిన వ్యాఖ్యలను కూడా తొలగించినట్లు వెల్లడించింది.
జూన్ 18న ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ వేదికగా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు మోదీ. అమర జవాన్ల త్యాగం వృథా కాదన్నారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, అదే సమయంలో అవసరమైతే ప్రత్యర్థికి తగిన రీతిలో బుద్ధి చెప్పగల సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించారు. ఈ స్పీచ్‌ను బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం సినో వీబో, విచాట్ అధికారిక ఖాతాల్లో షేర్ చేసింది. అయితే ఆ రెండు సామాజిక మాధ్యమ సంస్థలు.. మోదీ ప్రసంగాన్ని తొలగించాయి.
సినో వీబోకు చైనాలో ట్విట్టర్‌కు ఉన్నంత అదరణ ఉంది. విదేశీ రాయబార కార్యాలయాలు, ఇతర దేశాల అధినేతలు చైనా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ఖాతాలను తెరిచారు. భారత రాయబార కార్యాలయం పేజీని వేలాది మంది చైనీయులు అనుసరిస్తున్నారు. మోదీ స్పీచ్ తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే కారణంతోనే తొలగించినట్లు రెండు సామాజిక మాధ్యమ సంస్థలు తెలిపాయి.