తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కల్నల్​​ సంతోష్​ బృందాన్ని ఉచ్చులో బిగించారా? - india china firing

తూర్పు లద్దాఖ్​​లోని గాల్వన్​ లోయలో ఒక్క తూటా పేలకుండానే ఇరు వైపులా భారీగా ప్రాణ నష్టం జరిగింది. పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు. చైనా సైన్యం వ్యూహాత్మకంగానే కల్నల్​‌ సంతోష్‌ బాబు బృందాన్ని ఉచ్చులో బిగించినట్లు తెలుస్తోంది. తొలగించిన చెక్‌పోస్టును మళ్లీ ఏర్పాటు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడింది.

Chinese plot to target Colonel Santosh's team!
కర్నల్​ సంతోష్​ బృందాన్ని ఉచ్చులో బిగించారా?

By

Published : Jun 18, 2020, 6:12 AM IST

Updated : Jun 18, 2020, 6:31 AM IST

భరతమాత ముద్దుబిడ్డ కల్నన్​‌ సంతోష్‌బాబుతోపాటు మొత్తం 20 మంది భారత సైనికుల మరణానికి కారణమైన సైనిక సంఘర్షణ ఉదంతంలో వాస్తవాలేంటి? సోమవారం రాత్రి గల్వాన్‌ లోయ వద్ద ఏం జరిగింది? ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండానే ఇటువైపు 20 మంది, చైనా వైపు మరో 45 మంది వరకూ (భారత సైన్యం అంచనా ప్రకారం) ప్రాణాలు కోల్పోవడమే కాదు.. పదుల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు తీవ్రంగా గాయపడటం సాధారణ విషయం కాదు. అందుకే దీని వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు ‘ఈనాడు’ పలువురు సైనికాధికారులతో మాట్లాడింది. చైనా సైన్యం వ్యూహాత్మకంగానే సంతోష్‌బాబు బృందాన్ని ఉచ్చులో బిగించినట్లు తెలుస్తోంది.

సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 6న లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల చర్చల్లో ఇరు దేశాల సైనికులు రెండున్నర కిలోమీటర్లు వెనక్కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గల్వాన్‌ నది వద్ద చైనా ఏర్పాటు చేసిన 14వ నెంబరు నిఘా చెక్‌పోస్టును ఆ దేశం తొలగించింది. ఆ తర్వాత మళ్లీ ఆదివారం అక్కడ చెక్‌పోస్టు ఏర్పాటు చేసింది. భారత సైన్యం దాన్ని తొలగించాలని కోరినా చైనా దళాలు నిరాకరించగా, సంతోష్‌ నేతృత్వంలోని 16 బిహార్‌ రెజిమెంట్‌ దళం సోమవారం సాయంత్రం ఆ చెక్‌పోస్టును తొలగించడానికి ప్రయత్నించింది. దీంతో అప్పటికే అక్కడ మాటువేసిన చైనా సైనికులు ఒక్కసారిగా విరుచుకుపడి ఫెన్సింగ్‌ వైర్లు బిగించిన ఇనుపరాడ్లతో తీవ్రంగా దాడి చేశారని, కొంతమంది సైనికులను ఈడ్చుకుంటూ తమ భూభాగంలోకి లాక్కెళ్లారని, కొంతమంది కొండపై నుంచి పెద్ద బండరాళ్లు విసరడం మొదలుపెట్టారని సమాచారం. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే చాలామంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, మిగిలినవారు గల్వాన్‌నదిలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారని తెలుస్తోంది. వీరిచ్చిన సమాచారంతోనే రంగంలోకి దిగిన అదనపు దళాలు చైనా సైనికులతో తలపడ్డాయని తెలిసింది.

డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి దొంగదెబ్బ

గాల్వన్​ లోయ వద్ద సైనిక స్థావరాల ఉపగ్రహ చిత్రం

గల్వాన్‌ నది ప్రాంతంలో భారత్‌ చేపట్టిన అనేక మౌలిక నిర్మాణాలు చైనాకు కంటగింపుగా మారాయని, వీటిని నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో చైనా దొంగదెబ్బ తీయాలని వ్యూహం పన్నిందని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే భారత సైన్యాన్ని ఉచ్చులోకి లాగేందుకు.. తొలగించిన చెక్‌పోస్టును మళ్లీ ఏర్పాటు చేసిందని, దాన్ని తొలగించేందుకు భారత సైనికులు ఎలాగూ వస్తారు కాబట్టి వారిపై విరుచుకుపడేందుకు అవసరమైన సరంజామాతో చైనా సిద్ధంగా ఉండి ఒక్కసారిగా దాడి చేసి ఉంటుందని భావిస్తున్నామని ఓ అధికారి వెల్లడించారు. అయితే భారత సైనికుల ఆచూకీని కనిపెట్టడానికి చైనా డ్రోన్లు సైతం ఉపయోగించిందని విశ్వసనీయ వర్గాల సమచారం. గస్తీ బృందాలు అప్పుడప్పుడూ సరిహద్దులు దాటుతుంటాయని, ఈ విషయం గమనిస్తే ప్రత్యర్థి దేశ సైనికులు అక్కడకు చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేస్తారని, ఇటువంటప్పుడు ఇరు పక్షాల మధ్య ఘర్షణ జరుగుతుందని, ఇది ఒక్కోసారి తోపులాటకు, ముష్టిఘాతాల వరకూ దారితీస్తుందని, రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడం తప్ప ఇలా చంపుకునే వరకూ వెళ్లదని ఆయన వివరించారు. కాని 20 మందిని పొట్టనపెట్టుకున్నారంటే ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగి ఉంటుందనడంలో అనుమానం లేదని ఆయన అన్నారు.

గల్వాన్‌పై సడలని పట్టు

సైనిక సంఘర్షణ జరిగిన గల్వాన్‌ లోయపై భారత దళాలు ఇప్పటికీ పట్టుకోల్పోలేదని ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. మారణ హోమం జరిగిన 24 గంటల్లోపు తీసిన హై రెజల్యూషన్‌ ఉపగ్రహ చిత్రాలు గల్వాన్‌ వద్ద క్షేత్రస్థాయి పరిస్థితిని కళ్లకుకడుతున్నాయి. అక్కడ భారత్‌ కన్నా చైనా దళాలు భారీ సంఖ్యలో మోహరించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికీ అక్కడ చైనాకు చెందిన 200కి పైగా సైనిక వాహనాలు, చెక్‌పోస్టులు ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి సైనిక బలగాల ఉపసంహరణ నియమాలను చైనా యథేచ్ఛగా ఉల్లంఘించి భారత్‌ను మోసం చేసినట్లు సుస్పష్టంగా అర్థమవుతోంది. అయితే 20మంది సైనికులను కోల్పోయినా, పదుల సంఖ్యలో జవాన్లు గాయపడినా భారత దళాలు వెనక్కు తగ్గలేదని, గల్వాన్‌ లోయపై పట్టు నిలుపుకున్నాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

హెలికాప్టర్ల ద్వారా గాలింపు

సోమవారం సైనిక సంఘర్షణ ముగిసిన తర్వాత గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల కోసం భారత సైన్యం హెలికాప్టర్ల ద్వారా విస్తృతంగా గాలింపు చేపట్టింది. దీంతో పలువురు సైనికుల ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. చైనా కూడా డ్రోన్ల ద్వారా తమ సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'చైనా పేరును ప్రస్తావించడంలో భయమెందుకు'

Last Updated : Jun 18, 2020, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details