వాస్తవాధీన రేఖ వెంబడి చెలరేగిన ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా చల్లబరిచేందుకు, సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత కొనసాగించేందుకు భారత్-చైనాలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది.
తూర్పు లద్దాక్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు.. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్ ఒప్పందాల మేరకు చర్చలు జరిపి... సరిహద్దు సమస్యను పరిష్కరించుకోనేందుకు ఓ అంగీకారానికి వచ్చారు.
ఉద్దేశపూర్వకంగానే దాడి
సరిహద్దుల్లో యథాతథ స్థితికి భంగం కలిగిస్తూ.. చైనా ఉద్దేశపూర్వకంగానే గాల్వన్ లోయ వద్ద ఘర్షణకు దిగిందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పూర్తిగా చైనానే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.
భారత భూభాగంలో నిర్మాణాలు చేపట్టడానికి చైనా ప్రయత్నించడమే మొత్తం ఘర్షణలకు కారణమని జైశంకర్ పేర్కొన్నారు. చైనా బలగాలు వాస్తవాధీన రేఖను గౌరవించాలని, దాన్ని మార్చేందుకు ఏకపక్ష చర్యలు తీసుకోరాదని హెచ్చరించారు.
జూన్ 6న సీనియర్ కమాండర్ స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు... గ్వాలన్ లోయ నుంచి ఇరుదేశాలు తమతమ బలగాలను ఉపసంహరించుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనా ఏకపక్ష ధోరణి మానుకోవాలని హితవు పలికారు.