తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాత్రికి రాత్రి చైనా స్కెచ్​- ముందే పసిగట్టిన భారత్ - china news

చైనా కపటబుద్ధి గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది. పంచశీల ఒప్పందం నుంచి బ్రిటన్​తో ఒప్పందాల వరకు తుంగలోతొక్కి దుస్సాహసాలకు పాల్పడింది. తాజాగా పాంగాంగ్​ సరస్సు వద్ద భారత్​ను కూడా ఇలానే మోసం చేయాలని ప్రయత్నించింది. చైనా తీరుపై అనుమానంతో భారత్​ నిఘా వేయటం వల్ల అసలు విషయం బయటపడింది.

chinese-commander-over-smart
చైనా బ్యాచ్‌.. మాటలూ నకిలీనే..!

By

Published : Sep 13, 2020, 3:34 PM IST

చైనా ఏదైనా చెబితే దానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలేమో.. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసి పదేళ్లు కూడా కాక ముందే 1962లో భారత్‌పై దురాక్రమణ చేసింది. ఆ తర్వాత కూడా చాలా ఒప్పందాలకు తూట్లు పొడిచింది. మొన్నటికి మొన్న చైనా-బ్రిటన్‌ ఒప్పందాన్ని తుంగలోతొక్కి హాంకాంగ్‌ను గుప్పిట్లో బంధించింది. ఇలా చెప్పుకొంటు పోతే చైనా కథలు చాంతాడంత ఉంటాయి. తాజాగా పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత్‌ను కూడా ఇలానే మోసం చేయాలని డ్రాగన్‌ ప్రయత్నించింది. చైనా అధికారుల తీరు.. ఆప్యాయతలపై అనుమానం వచ్చిన భారత్‌ నిఘా వేయడం వల్ల అసలు విషయం బయటకు వచ్చింది.

ఆగస్టు 28న ఏం జరిగింది..

చుషూల్‌ వద్ద సైనికాధికారులతో చైనాకు చెందిన కమాండర్లు లోకల్‌ హాట్‌లైన్‌లో చర్చలు జరిపారు. తొలుత చైనా నుంచి అధికారులు భారత్‌ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరు వర్గాలు మాట్లాడుకొన్నాయి. రాత్రివేళలో ఇరుపక్షాల దళాలు గస్తీలు నిర్వహించకూడదని చైనా అధికారులు పలుమార్లు చెప్పారు. దీంతో భారతీయ కమాండర్లకు వారి తీరుపై అనుమానం వచ్చింది. గతంలో వారు చెప్పినవి ఏవీ చేసిన దాఖలాలు లేవు. గల్వాన్‌ వద్ద కూడా ఇలానే మోసపూరితంగా వ్యవహరించింది. ఇవన్నీ మదిలో మెదిలి మనవాళ్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

ఆగస్టు 28 రాత్రి తొలిసారి భారత నిఘా బృందం మాల్డోలో సాయుధ వాహనాల కదలికను గుర్తించాయి. దీంతో డ్రోన్లను రంగంలోకి దించి పీఎల్‌ఏ కదలికలపై నిఘా వేశారు. డ్రాగన్‌ దళాలు ఎల్‌ఏసీ వైపుగా ప్రత్యేక లక్ష్యం వైపు కదులుతున్నట్లు గుర్తించారు. వెంటనే భారత ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ దళాలు రంగంలోకి దిగాయి. చుషూల్‌లోని కీలకమైన శిఖరాలపై పట్టు సాధించి రెఖిన్‌ పాస్‌, స్పంగూర్‌ గ్యాప్‌పై భారత వ్యూహాత్మక పట్టును సాధించాయి. దీంతో చైనా దళాలు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్‌ తగిన సంఖ్యలో అక్కడ దళాలను మోహరించింది. ఆ తర్వాత భారత దళాలు పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉత్తర భాగంలోని ఫింగర్‌4 సమీపంలోని కీలక స్థానాలకు కూడా చేరింది.

పాంగాంగ్​ సరస్సు ప్రాంతం

భారీగా మోహరిస్తున్న డ్రాగన్‌ దళాలు..

ఈ ఘటన తర్వాత భారీ సంఖ్యలో చైనా దళాలు మోహరింపు వేగవంతమైంది. వేల సంఖ్యలో దళాలు, భారీ శతఘ్నులను అక్కడికి చేర్చింది. ఆగస్టు 30 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా స్పంగూర్‌ గ్యాప్‌ నుంచి గురాంగ్‌హిల్‌, మగర్‌ హిల్‌ సమీపంలోకి ఇవి చేరుతున్నాయి. దీంతో భారత్‌ కూడా డ్రాగన్‌కు సరితూగే దళాలను అక్కడికి తరలించింది. మిలీషియా దళాలను కూడా చైనా తీసుకొచ్చింది. వీటిల్లో సైనికులు, బాక్సర్లు, స్థానిక ఫైట్‌క్లబ్‌ల సభ్యులు ఉంటారని భావిస్తున్నారు. ఈ బృందాలు పీఎల్‌ఏలో రిజర్వు ఫోర్స్‌గా పనిచేస్తున్నాయి. ఇవి యుద్ధ సమయంలో పీఎల్‌ఏ సైనిక ఆపరేషన్లలో సహాయకారిగా వ్యవహరిస్తాయి.

ఇదీ చూడండి: చర్చల బాధ్యత రెండు దేశాలపై ఉంది: చైనా

ABOUT THE AUTHOR

...view details