వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా దుర్బుద్ధి బయటపడుతూనే ఉంది. తాజాగా ఈశాన్య లద్దాఖ్ ప్రాంతంలో గల్వాన్ నదిని కప్పేయడానికి లేదా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి చైనా పెద్దఎత్తున ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్‌డీటీవీ’ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దాడికి తెగబడిన ప్రాంతానికి కిలో మీటరు లోపలే ఆ దేశం ఈ దురాగతానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనా వైపు ఎల్‌ఏసీ వెంబడి భారీగా బుల్డోజర్లు మోహరించి ఉన్నాయి. ఆ ప్రాంతంలో గల్వాన్ నదీ ప్రవాహ గతి కూడా మారుతోంది.
భారత్ వైపు ఎల్‌ఏసీ ప్రాంతానికి వచ్చేసరికి నీటి ప్రవాహం కుంచించుకుపోవడమే కాకుండా బురదగా కనిపిస్తోంది. 5 కి.మీ.లకు పైగా చైనా ట్రక్కులు, సైనిక వాహనాలు, బుల్డోజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. గల్వాన్ లోయలో ఇప్పటికైతే నదీ ప్రవాహం కొనసాగుతున్నట్లు భారత సీనియర్ సైనికాధికారులు 'ఎన్‌డీటీవీ'కి తెలిపారు.