చెన్నై విమానాశ్రయానికి చేరుకొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్... నేపాల్‌కు పయనమయ్యారు. రెండురోజుల పాటు జరిగిన ఇరుదేశాల అనధికారిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
లైవ్: ముగిసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన - మోదీ తాజా వార్తలు
14:19 October 12
ముగిసిన జిన్‌పింగ్ పర్యటన...
13:52 October 12
విజయ్ గోఖలే పత్రికా సమావేశం...
మోదీ, జిన్‌పింగ్ 90 నిమిషాల పాటు చర్చించారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా సమావేశంలో తెలిపారు. ఇరువురు నేతల చర్చల అనంతరం ప్రతినిధి బృందాలు చర్చలు జరిపాయన్నారు. పర్యటకం, వాణిజ్యం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారని... నిన్న, ఇవాళ మొత్తం 6 గంటలపాటు చర్చలు జరిగాయన్నారు.
ఇరువురు నేతల మధ్య చర్చల్లో కశ్మీర్ అంశం ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. పెరుగుతోన్న తీవ్రవాదం రెండు దేశాలకు మంచిది కాదని దేశాధినేతలు భావించారని వెల్లడించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర అంశాలపై త్వరలో చర్చలు ఉంటాయని.. భారత్ తరఫున నిర్మలా సీతారామన్, చైనా తరఫున ఆ దేశ ఉపాధ్యక్షుడు చర్చల్లో పాల్గొంటారని గోఖలే తెలిపారు.
13:13 October 12
చెన్నై బయల్దేరిన జిన్‌పింగ్
తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్ హోటల్ నుంచి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చెన్నై బయల్దేరారు. మరికాసేపట్లో చెన్నైకి తిరుగుపయనం కానున్నారు. మోదీతో రెండు రోజుల భారత పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. నేడు ఇరువురు దేశాధినేతలు చర్చలు జరిపారు.
12:36 October 12
చేనేత, కళాఖండాల సందర్శన...
ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్.. 'తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్' హోటల్లో ఏర్పాటు చేసిన చేనేత, కళాఖండాల ప్రదర్శనను తిలకించారు. అద్భుతమైన కళాఖండాలను జిన్‌పింగ్ ఆసక్తిగా వీక్షించారు.
12:27 October 12
శాంతికి విఘాతం కలగనివ్వం...
ఇరుదేశాల మధ్య ఉన్న మనస్పర్ధలను.. వివాదాలుగా మారనివ్వబోమని ప్రధాని మోదీ తెలిపారు. విభేదాలు పెరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడమని పేర్కొన్నారు.
12:04 October 12
ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం...
పర్యటనలో భారత్ తమకు ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ మర్చిపోలేమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల సంబంధాలకు ఈ చెన్నై పర్యటన నుతన అధ్యాయం కానుందన్నారు. మోదీ చూపిన స్నేహభావం మనసుని తాకిందన్నారు.
11:58 October 12
వ్యూహాత్మక సహకారానికి నాంది...
ఈ సమావేశం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మకమైన సహకారానికి నాంది పలుకుతోందని మోదీ తెలిపారు. చైనా, భారత్ 100 కోట్లకు పైగా జనాభా కలిగిన ప్రధానమైన దేశాలని.. ఇరుదేశాల మధ్య చర్చలు జరగడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు.
11:38 October 12
ప్రతినిధి బృందం స్థాయి చర్చలు...
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ప్రతినిధి బృందం స్థాయి చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు.
11:17 October 12
ముగిసిన భేటీ...
ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం ముగిసింది. కోవలంలోని హోటల్ తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్‌లో ఇరువురు నేతల సమావేశం అయ్యారు. అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చర్చలు జరిపారు. ప్రస్తుతం ఇరు దేశాల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.
10:27 October 12
మొదలైన భేటీ...
ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ అయ్యారు. కోవలంలోని 'తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్' హోటల్లో ఇరువురు అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రాంతీయ సమస్యల నుంచి అంతర్జాతీయ వివాదాల వరకు ఇరువురు మాట్లాడనున్నారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించే దిశగా ఈ చర్చలు నడవనున్నాయి. భారత్-చైనా మధ్య ఉన్న సుదీర్ఘ సరిహద్దు వద్ద శాంతి నెలకొనేందుకు ఈ సమావేశం తోడ్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
10:16 October 12
జిన్‌పింగ్‌కు మోదీ స్వాగతం...
రెండో రోజు పర్యటనలో భాగంగా జిన్‌పింగ్.. కోవలం చేరుకున్నారు. తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్ హోటల్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌ను.. ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానించారు.
09:45 October 12
కోవలం బయల్దేరిన జిన్‌పింగ్...
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండో రోజు పర్యటనలో భాగంగా చెన్నై ఐటీసీ గ్రాండ్ హోటల్ నుంచి కోవలం బయలుదేరారు. మోదీతో కోవలంలో జిన్‌పింగ్ సమావేశం కానున్నారు.
08:57 October 12
జిన్‌పింగ్ రెండో రోజు టూర్ లైవ్ అప్డేట్స్
రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్‌కు విచ్చేశారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. ఈ సందర్భంగా ఆయన తొలిరోజు పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం మొదలు.. ప్రధాని మోదీతో కలిసి మహాబలిపురంలోని చారిత్రక కట్టడాల సందర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడం వరకు ఎంతో ఉత్సాహంగా గడిపారు జిన్‌పింగ్.
జిన్‌పింగ్ రెండోరోజు పర్యటనలో భాగంగా ఇరుదేశాధినేతలు ఇష్టాగోష్ఠి జరపనున్నారు. నిర్దిష్ట ఎజెండా, అధికార లాంఛనాలులేని వాతావరణంలో ఇది సాగనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అనంతరం ప్రతినిధి స్థాయి బృందం చర్చలు జరగనున్నాయి. శిఖరాగ్ర సదస్సు అనంతరం రెండు పక్షాలూ విడిగా ప్రకటనలు వెలువరిస్తాయి. చెన్నై నుంచి ఇవాళ మధ్యాహ్నమే తిరుగుపయనం కానున్న చైనా అధ్యక్షుడి రెండోరోజు పర్యటన ఇలా సాగనుంది.
అక్టోబర్ 12 (శనివారం)
ఉదయం 9 గంటలకు జిన్‌పింగ్ మహాబలిపురానికి పయనమవుతారు. అనంతరం ప్రధాని మోదీతో చైనా అధ్యక్షుడు అనధికారిక భేటీలో పాల్గొంటారు.
మధ్యాహ్నం
- 1:00 : జిన్‌పింగ్ చెన్నైకు తిరుగుపయనం
- 2:20 : చైనాకు బయలుదేరనున్న జిన్‌పింగ్
జిన్‌పింగ్‌తో మోదీ స్నేహగీతిక..
చైనా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రాలను ధరించారు. మహాబలిపురంలోని పలు చారిత్రక కట్టడాలను వీక్షిస్తూ ఇరువురు నేతలు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. చారిత్రక కట్టడాల విశిష్టత, శిల్ప కళా సౌందర్యాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. పరమశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రం పొందే శిల్పాన్ని , కృష్ణుడి వెన్నముద్ద శిలను, ఏకశిలాకట్టడాలైన పంచరథాలు, ఇతర విగ్రహాలను ఇరువురు నేతలు సందర్శించారు. వెయ్యేళ్ల క్రితం వీటిని నిర్మించిన పల్లవరాజుల గొప్పదనాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. ఆలయ ప్రాంగణంలోనే కొబ్బరి బోండాలు సేవిస్తూ పలు అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నారు. అనంతరం మహాబలిపురం సముద్రతీర ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాప్రదర్శనలను మోదీ, జిన్‌పింగ్ వీక్షించారు. జిన్‌పింగ్ గౌరవార్థం రాత్రికి మోదీ విందు ఏర్పాటు చేశారు.