'ఏయ్ ఇది మా భూభాగం.. వెళ్లిపో వెనక్కి..' గస్తీలో ఉన్న భారత లెఫ్టినెంట్‌కు చైనా మేజర్ హెచ్చరిక అది!
తాను ఉన్న భూభాగం కచ్చితంగా సిక్కింలోదేనని భారత గస్తీదళానికి స్పష్టంగా తెలుసు. కానీ చైనా సైనికులు పదేపదే బాగా రెచ్చగొడుతున్నారని అర్థమవుతోంది. దీంతో భారత గస్తీ బృందానికి నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్‌కు కోపం తన్నుకొచ్చింది. తన మాతృభూమిలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా బెదిరిస్తున్న చైనా మేజర్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లి అతని మూతిపై చాచికొట్టాడు. ఆ దెబ్బకి... చైనా మేజర్ ముక్కుపగిలింది. రక్తం కారుతుండగా కింద పడిపోయాడు. భారత వీరసైనికుల ఆగ్రహాన్ని గ్రహించిన చైనా గస్తీదళం మెల్లగా వెనక్కి మళ్లింది.
కొన్ని రోజుల క్రితం సిక్కిం సరిహద్దులో జరిగిన ఘటన ఇది. భారత యువ సైనికాధికారి సైన్యంలో చేరి కొద్దికాలమే అయింది. చూడటానికి బక్కపల్చగా కనిపించినా గుండెల నిండా ధైర్యం, దేశాన్ని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా తట్టుకోలేడు తత్వం. ఈ ఘటన సమాచారం సైనిక ఉన్నతాధికారులకు చేరింది. మొదట్లో ఆందోళన చెందినా మన దేశంలోకి చొచ్చుకొచ్చిన చైనా మూకలపై దాడి సరైన నిర్ణయమేనని తీర్మానించారు.