భారత్-చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. 1962లో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధం అప్పుడే స్వాతంత్య్రం పొందిన దేశాల మధ్య జరిగిన అంశంగా పరిగణించినా ప్రస్తుతం గాల్వన్‌లో జరిగిన ఉద్రిక్తతలు వ్యూహాత్మక ఆధిపత్యం కోసమే జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఉద్రిక్తతల వెనక తమకు హాని చేసేలా భారత్-అమెరికాల మధ్య పెరుగుతున్న సైనిక, వ్యూహాత్మక సంబంధాలను దెబ్బకొట్టాలని చైనా భావిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. ఈ ఘర్షణలు కేవలం చైనా సైనికుల దుస్సాహసం కాదని.. దీని వెనక భారత్ గ్లోబల్ శక్తిగా ఎదగకుండా ఆపడం సహా.. ట్రంప్-మోదీల మైత్రిని చీల్చాలన్న పక్కా ప్రణాళిక ఉందని అభిప్రాయపడుతున్నారు.
చైనా వ్యవహార శైలే ఉదాహరణ..
ఉద్రిక్తతల అంశంలో.. భారత్‌కు అమెరికా ఎంతవరకు మద్దతిస్తుందో గమనించాలని చైనా భావిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. తదనుగుణంగా అమెరికాతో సంబంధాలపై ప్రధాని మోదీని పునరాలోచింపజేసేలా చేయాలని చైనా అనుకుంటుందన్నారు. అటు.. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేలా భారత్, అమెరికా, ఆస్ట్రేలియా,జపాన్‌ల మైత్రిని దెబ్బకొట్టాలని డ్రాగన్ ఈ తరహాలో ప్రవర్తిస్తున్నట్లు... దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు వియత్నాం, ఆస్ట్రేలియా, తైవాన్, హాంకాంగ్‌తో చైనా వ్యవహారశైలే ఉదాహరణ అని చెబుతున్నారు.