దురాక్రమణ బుద్ధితో బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలనే యోచనలో చైనా ఉంది. డ్యామ్ నిర్మించేందుకు ఆ దేశం ఎలాంటి ప్రయత్నం చేసినా భారత్, బంగ్లాదేశ్ హక్కులను కాలరాసినట్లేనని కేంద్రం తెలిపింది. జలవనరుల శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
సరిహద్దు నదుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య 2006లో ఏర్పాటైన నిపుణుల స్థాయి యంత్రాంగం వంటి వేదికలున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రాజెక్టు చేపడితే భారత్, బంగ్లాదేశ్ నీటి కరవు ఎదుర్కోక తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది. నీటిని మళ్లించేందుకు చైనా ప్రయత్నం చేస్తే భారత హక్కుల దురాక్రమణ జరిగినట్లే అని తేల్చి చెప్పింది.
వాస్తవాధీన రేఖ వెంబడి బ్రహ్మపుత్ర నదిపై(చైనాలో యార్లంగ్ జాంగ్బో నది) భారీ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చైనా గతేడాది ప్రకటించింది. అయితే.. చైనా ఆనకట్టల ప్రతిపాదనలు భారత్, బంగ్లాదేశ్‌లోని నదీ పరీవాహక రాష్ట్రాల్లో ఆందోళనలు రేకెత్తించాయి. ఈ విషయంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హ్యూ చున్యింగ్ స్పందిస్తూ యార్లంగ్ జాంగ్బో నదీ పరీవాహక ప్రాంతాల్లో జల విద్యుత్ ఉత్పత్తి చైనా చట్టబద్ధమైన హక్కు అని వ్యాఖ్యానించారు.