తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఒప్పందాలను కాదని భారత్​తో చైనా కయ్యం - india china war update

భారత్​-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన సంవత్సరాలుగా కొనసాగుతోంది. పరిష్కారమే లక్ష్యంగా ఐదు ముఖ్య ఒప్పందాలు కుదిరాయి. కానీ, వివాదం పరిష్కారం కాలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒప్పందాలపై కీలక విషయాలు తెలుసుకుందాం.

China is in violation of border agreements
ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న చైనా

By

Published : Jun 17, 2020, 6:19 AM IST

భారత్‌-చైనా మధ్య 1962లో యుద్ధం జరిగాక సరిహద్దు వివాదంపై నిలిచిపోయిన చర్చలు తిరిగి 1981లో ప్రారంభమయ్యాయి. సరిహద్దుపై ఉన్న విభేదాల పరిష్కారమే లక్ష్యంగా ఆ తర్వాత ఐదు ముఖ్య ఒప్పందాలు కుదిరాయి. అయినా వివాదం పరిష్కారం కాలేదు. చైనా బలగాల దుందుడుకు వైఖరే ఇందుకు ప్రధాన కారణం. పలు సందర్భాల్లో ఆ దేశ సైనికులు ఎల్‌ఏసీని అతిక్రమించారు. కయ్యానికి కాలు దువ్వారు. రెండు దేశాల బలగాల మధ్య తాజా ఘర్షణ నేపథ్యంలో ఈ ఒప్పందాల సారాంశం క్లుప్తంగా..

1. 1993-ఎల్‌ఏసీ వెంబడి శాంతి, ప్రశాంతత కొనసాగింపు ఒప్పందం

సరిహద్దు వివాదంపై అంతిమ పరిష్కారం లభించేంత వరకు రెండు దేశాలూ ఎల్‌ఏసీని కచ్చితంగా గౌరవించాలి. వాస్తవాధీన రేఖను ఎవరూ అతిక్రమించకూడదు. రెండు దేశాలూ ఎల్‌ఏసీ వెంబడి బలగాలను కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవాలి.

2. 1996-ఎల్‌ఏసీ వెంబడి పరస్పర విశ్వాస పెంపు చర్యల (కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌ మెజర్స్‌-సీబీఎం) ఒప్పందం

ఎల్‌ఏసీ వెంబడి మోహరించిన సైనిక బలగాలను అవతలివారిపై దాడికి ఉపయోగించకూడదు. పరస్పరం అంగీకరించిన ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులు, యుద్ధ వాహనాలు, 75ఎంఎం లేదా అంతకన్నా ఎక్కువ క్యాలిబర్‌ ఉన్న శతఘ్నులు, ఆయుధ సంపత్తిని తగ్గించుకోవాలి.

3. 2005- పరస్పర విశ్వాస పెంపునకు అనుసరించాల్సిన విధివిధానాల ఒప్పందం

ఎల్‌ఏసీకి సమీపంలో ఒక డివిజన్‌కన్నా ఎక్కువగా ఉండే భారీ సైనిక విన్యాసాలు నిర్వహించకూడదు. (ఒక డివిజన్‌లో దాదాపు 15వేల మంది సైనికులుంటారు.) సైనికులు పరస్పరం విభేదించే పరిస్థితి వస్తే నిగ్రహం చూపాలి. వెంటనే ప్రధాన కార్యాలయాలకు సమాచారం అందించాలి. సరిహద్దు సమావేశాలతో లేదా దౌత్యమార్గాల్లో చర్చలు ప్రారంభించాలి.

4. 2012- సరిహద్దు వ్యవహారాల్లో సమన్వయానికి కార్యశీల యంత్రాంగం (వర్కింగ్‌ మెకానిజం) ఏర్పాటు ఒప్పందం

కార్యశీల యంత్రాంగానికి భారత్‌ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. చైనా తరఫున విదేశాంగ శాఖ నుంచి డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. శాంతి, ప్రశాంతతకు భంగం కలగడానికి అవకాశం ఉన్న అంశాలపై దృష్టి పెట్టి పరిష్కారానికి ఈ యంత్రాంగం ప్రయత్నించాలి.

5. 2013- సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం

రెండు దేశాలూ చట్టాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా రక్షణ సహకారాన్ని అమలు చేయాలి. భారత్‌, చైనా రక్షణ మంత్రిత్వశాఖల మధ్య ఎప్పటికప్పుడు సమావేశాలు జరగాలి. ఆయుధాలు, వన్యప్రాణుల స్మగ్లింగ్‌పై సంయుక్తంగా పోరాడాలి. ప్రకృతి విపత్తుల సమయంలో, అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం ఉన్న సమయాల్లో పరస్పరం కలిసి పని చేయాలి.

ఇదీ చూడండి:నెత్తురోడిన గాల్వన్​ లోయ.. ఇరువైపులా భారీ ప్రాణనష్టం!

ABOUT THE AUTHOR

...view details