తూర్పు లద్దాఖ్ గల్వాన్ నుంచి బలగాల ఉపసంహరణపై... జూన్ 6న కుదిరిన ఒప్పందాన్ని పటిష్టంగా అమలుచేయాలని భారత్-చైనా నిర్ణయించాయి. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ పేర్కొంది. భారత్-చైనా మధ్య దౌత్యస్థాయిలో జరిగిన సమావేశం అనంతరం.. ఈ కీలక వ్యాఖ్యలు చేసింది భారత విదేశాంగశాఖ.
గల్వాన్ లోయ వద్ద జూన్ 15న చెలరేగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్-చైనాలు మిలటరీ, దౌత్య స్థాయిలో చర్చలు నిర్వహించాయి.
ఎల్ఏసీని గౌరవిద్దాం..
భారత విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నవీన్ శ్రీవాస్తవ.. చైనా విదేశాంగశాఖ డైరెక్టర్ జనరల్ వూ జియాంగ్వో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్వాన్ ఘటన సహా తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవాధీనరేఖను ఇరుదేశాలు గౌరవించాలని స్పష్టం చేసింది.
"ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్రకారం, ఈ ఒప్పందాన్ని వేగంగా అమలుచేయాలని భారత్-చైనాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అప్పుడు మాత్రమే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత నెలకొంటాయని అభిప్రాయపడ్డాయి. దీని వల్ల ఇరుదేశాల మధ్య విస్తృత సంబంధాల అభివృద్ధి కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి." - భారత విదేశాంగశాఖ