తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో ట్యాంకుల 'రణ'గొణ ధ్వనులు! - India china border news

ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే.. మరోవైపు కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. తూర్పు లద్దాఖ్​లో తన సైనిక మోహరింపులను పెంచుకుంటూ పోతోంది. తాజాగా దక్షిణ పాంగాంగ్​ ప్రాంతంలోకి అదనంగా ట్యాంకులు, పదాతి దళాన్ని రప్పించింది. చైనా చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తోన్న భారత్​.. అందుకు దీటుగా తమ బలగాలను మోహరిస్తోంది.

China heavily deploying
సరిహద్దులో ట్యాంకుల 'రణ'గొణ ధ్వనులు!

By

Published : Sep 5, 2020, 5:59 AM IST

తూర్పు లద్దాఖ్‌లో చైనా తన సైనిక మోహరింపులను పెంచుకుంటూ పోతోంది. తాజాగా దక్షిణ పాంగాంగ్‌ ప్రాంతంలోకి అదనంగా ట్యాంకులు, పదాతి దళాన్ని రప్పించింది. సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల్లోని వ్యూహాత్మక పర్వత శిఖరాలను భారత్‌ ఇటీవల స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ చర్యను చేపట్టింది. దీంతో వివాదం నానాటికీ తీవ్ర రూపం దాలుస్తోంది.

పాంగాంగ్‌ దక్షిణ తీరంలోని మోల్దోలోని చైనా సైనిక శిబిరాలకు చేరువలో కొత్తగా వచ్చిన డ్రాగన్‌ ట్యాంకు బలగాలను భారత సైన్యం గుర్తించింది. అక్కడి థాకుంగ్‌ నుంచి ముక్‌పారి వెలుపలి వరకూ ఎత్తయిన ప్రాంతాలపై మన బలగాలు మోహరించినందువల్ల చైనా కదలికలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కీలకమైన స్పాంగుర్‌ గ్యాప్‌ కూడా భారత అధీనంలో ఉండటం కలిసొస్తోంది. రెండు కిలోమీటర్లకుపైగా వెడల్పు ఉన్న ఈ పర్వత కనుమ ట్యాంకుల సంచారానికి అనువుగా ఉంటుంది.

దాడి తేలిక..

భారత సైన్యం కూడా పాంగాంగ్‌ ప్రాంతంలో ట్యాంకు దళాలను రంగంలోకి దించింది. ఎల్‌ఏసీ వెంబడి తన అధీనంలో ఉన్న పర్వత శిఖరాల వద్ద తన పట్టును నిలుపుకొనేందుకు అదనపు బలగాలను మోహరించింది. దీనివల్ల దిగువ ప్రాంతంలో చైనా ట్యాంకులు, బలగాలపై ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణులు, రాకెట్లు, ఇతర ఆయుధాలతో సులువుగా దాడి చేయడానికి మన సైన్యానికి వీలవుతుంది. వీటికితోడు భారత్‌ మోహరించిన టి-90 ప్రధాన యుద్ధ ట్యాంకు కూడా క్షిపణులను ప్రయోగించగలదు. ఆధునికీకరించిన టి-72ఎం1 ట్యాంకులనూ మన సైన్యం రప్పించింది.

భారత చక్రబంధంలోనే..

మొత్తం మీద చూస్తే పాంగాంగ్‌ ప్రాంతంలో భారత ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ కీలకమైన 'బ్లాక్‌ టాప్‌', 'హెల్మెట్‌' ప్రాంతాలు ఇంకా చైనా అధీనంలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రెండు ప్రదేశాలూ.. సమీపంలోని పర్వతాలపై మోహరించిన భారత సైనికుల ఆయుధాల పరిధిలోనే ఉన్నాయి. బ్లాక్‌ టాప్‌, హెల్మెట్‌ పర్వత పాదాలు కూడా భారత బలగాల అజమాయిషీలో కొనసాగుతున్నాయి. అందువల్ల అవి మన చక్రబంధంలోనే ఉన్నాయి. ఆ రెండు శిఖరాలపై ఉన్న తన సైనికులకు ఆహారం, ఇతర నిత్యావసరాలను సరఫరా చేయడం, దీర్ఘకాలం పాటు అక్కడ మోహరింపును కొనసాగించడం చైనాకు చాలా కష్టం.

గగనతలంలోనూ పెరిగిన ఉద్ధృతి

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తాజాగా గగనతలంలోనూ హడావుడి పెరిగింది. సమీపంలోని ఎంగారి-గున్సా, హోటన్‌ వైమానిక స్థావరాల్లో యుద్ధ విమానాల సంఖ్యను చైనా పెంచింది. సుఖోయ్‌-30 జెట్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి యుద్ధవిమానాలు భారత్‌ వద్ద కూడా ఉన్నాయి. రెండు దేశాలూ తమ లోహ విహంగాలకు తోడ్పాటు ఇవ్వడానికి ఎలక్ట్రానిక్‌ హెచ్చరిక వ్యవస్థలనూ మోహరించాయి.

చైనా సంస్థపై నిశిత పరిశీలన

చైనీస్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ అండర్‌స్టాండింగ్‌ (సీఏఐఎఫ్‌యూ) సంస్థ తరఫున దాఖలయ్యే వీసా దరఖాస్తులపై నిశిత పరిశీలన జరపాలని భారత్‌ నిర్ణయించింది. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ అధికారి జీ బింగ్‌షువాన్‌ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. భద్రతాపరంగా దీన్ని ఆందోళనకర సంస్థగా ప్రకటించినట్లు భారత అధికార వర్గాలు తెలిపాయి. ఇతర దేశాలతో సాంస్కృతిక, నాగరిక సంబంధాలను పెంపొందించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు చైనా అధికారులు చెబుతున్నప్పటికీ ఇది ఆయా దేశాల్లోని రాజకీయ, సామాజిక అంశాల్లో జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఉద్రిక్తంగానే పరిస్థితి: సైన్యాధిపతి

ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె తెలిపారు. అయితే ఎలాంటి పరిస్థితి తలెత్తినా తిప్పికొట్టడానికి భారత సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. స్వీయ భద్రతా చర్యల్లో భాగంగా కొన్ని ముందస్తు మోహరింపులను చేపట్టామన్నారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన లద్దాఖ్‌లో చేపట్టిన రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. బలగాల నైతిక స్థయిర్యం, ఆరోగ్యం అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. భారత సైన్యం అత్యున్నత స్థాయి నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తోందన్నారు. తాజా వివాదం చర్చల ద్వారా పరిష్కారమవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. మరోవైపు చైనా సైన్యంతో ఇటీవల జరిగిన ఘర్షణల్లో ధైర్య సాహసాలను ప్రదర్శించిన 291 మంది భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) జవాన్లకు పురస్కారాలు అందాయి. ఐటీబీపీ డీజీ ఎస్‌.ఎస్‌.దేశ్వాల్‌.. ఇటీవల అనేక సరిహద్దు శిబిరాలను సందర్శించి, వీటిని అందించారని శుక్రవారం ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాకేశ్‌ అస్థానా శుక్రవారం జమ్మూ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దును సందర్శించి భద్రతా పరిస్థితులను సమీక్షించారు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

ABOUT THE AUTHOR

...view details