భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? అనే విషయంపై ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోదీ వ్యాఖ్యలు.. ఉపగ్రహ చిత్రాల్లో వాస్తవాలు వేరువేరుగా ఉంటే, అది చైనాకే లాభమని తెలిపారు.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో అమరులైన జవాన్ల గౌరవార్థం కాంగ్రెస్ చేపట్టిన "స్పీక్ అప్ ఫర్ జవాన్స్" కార్యక్రమంలో భాగంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు రాహుల్. దేశమంతా ఐకమత్యంతో మోదీ వెంట ఉంటుందని తెలిపిన రాహుల్.. చైనాను భారత భూభాగం నుంచి వెనక్కి పంపాల్సిందేనని స్పష్టం చేశారు.
"చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని మీరు(మోదీ) అంటున్నారు. కానీ మీ వ్యాఖ్యలు అబద్ధమైతే అది చైనాకే లాభం. మోదీజీ.. భయపడకుండా మాట్లాడండి. దేశ ప్రజలకు మీరు నిజం చెప్పాల్సిందే. 'చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది.. కానీ మేము పోరాడతాము' అని చెప్పడానికి భయపడకండి. దేశం మొత్తం మీ వెన్నంటే ఉంటుంది."