చైనా జిత్తులమారి. రెండు అడుగులు ఆక్రమించి ఒక అడుగు వెనక్కి వేయడం ఆ దేశానికి మామూలే. 1962 యుద్ధంలో అదే చేసింది. 2020లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటోంది. అందుకే గల్వాన్, పాంగాంగ్ ప్రాంతాల్లో దూకుడు పెంచుతూనే.. తాజాగా తూర్పు సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీగా బలగాలను మోహరిస్తోంది.
సరిహద్దునూ గుర్తించని చైనా
అరుణాచల్‌ప్రదేశ్‌తో భారత్‌కు 1,126 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఇక్కడ మెక్ మోహన్ రేఖ రెండు దేశాలను చీలుస్తుంది. అయితే ఈ రేఖను చైనా గుర్తించడం లేదు. అంతేకాదు.. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం తనదేనని వాదిస్తోంది. తమ దేశంలో అంతర్భాగంగానే ఆ రాష్ట్రాన్ని మ్యాపుల్లో చూపిస్తోంది. దీనిపై పలుమార్లు భారత్ అభ్యంతరం వ్యక్తంచేసింది. అయినా పట్టించుకోకుండా వీలు చిక్కినప్పుడల్లా అరుణాచల్ సరిహద్దుల్లోకి చైనా చొరబాట్లు సాగుతూనే ఉన్నాయి. తాజా ఘర్షణల నేపథ్యంలో.. మరోసారి అరుణాచల్ కేంద్రంగా డ్రాగన్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోంది. తవాంగ్, వాలంగ్ సెక్టార్లలో చైనా కదలికలు ఎక్కువయ్యాయి.
అందులో చైనాదే పైచేయి
చైనాకు అరుణాచల్ ప్రదేశ్‌కు మధ్య సరిహద్దులు.. లద్దాఖ్‌లోలా ఎడారి ప్రాంతాలను తలపించవు. పెద్ద పెద్ద పర్వతాలు, దట్టమైన అడవులు ఉంటాయి. ఇక్కడ బలగాల మోహరింపు.. ఖర్చుతో కూడిన పని, పైగా సుదీర్ఘకాలం సైన్యాన్ని సరిహద్దుల్లోనే ఉంచితే యుద్ధ సన్నద్ధత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించాలని చైనా ప్రయత్నించే అవకాశాలున్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. తొలి నుంచీ అరుణాచల్ సరిహద్దులను చైనా కీలకంగా భావిస్తోంది. యుద్ధమంటూ వస్తే.. ఇక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి సులభంగా చొరబడొచ్చని భావిస్తుంది. అందుకే సరిహద్దుల్లో భారీగా మౌలిక సదుపాయాలు ఏర్పరచింది. రహదారులు, వంతెనలు నిర్మించింది. ఉదాహరణకు భారత్‌కు చెందిన ట్యుటింగ్Å పోస్టుకు 15 కిలోమీటర్ల దూరంలోనే చైనాకు చెందిన నింగ్చి మిలిటరీ స్థావరం ఉంది. అందులో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. భారత్ పోస్టుల్లో కనీస వసతులే కనిపించవు.
అలక్ష్యం వద్దు!
చైనాతో తూర్పు సరిహద్దుల్లో పోరాటం ఎప్పుడూ క్లిష్లమైందే. 1962లో కూడా ఈ ప్రాంతాల్లోకి అవలీలగా చైనా సైన్యం చొచ్చుకుని వచ్చింది. కారణం..ముందస్తు ప్రణాళిక లేకపోవడమే. మరోసారి అలా కాకుండా ఉండాలంటే భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సరిహద్దు వెంబడి సదుపాయాలు పెంచుకోవాలి. మోదీ అధికారంలోకి రాగానే అప్పటి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ నిర్భయశర్మ కేంద్రానికి ఓ లేఖ రాశారు. అందులో మెక్‌మోహన్ రేఖను తాకుతూ చైనా ఎలా రహదారులు నిర్మించిందీ క్షుణ్ణంగా వివరించారు. ఆ లేఖకు కేంద్రం స్పందించింది. అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కానీ సరిపోవు. చాలా చేయాలి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో అరుణాచల్ సరిహద్దుల్లో సత్వరమే అదనపు బలగాలను మోహరించాలి. రిజర్వు బలగాలనూ అట్టిపెట్టుకోవాలి. సరిహద్దుల వెంబడి పోస్టులకు త్వరితగతిన అవసరమైన సరకులు, ఆయుధాలు తరలించే వ్యవస్థను మెరుగుపరచుకోవాలి. 1962 యుద్ధంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
ఇదీ చూడండి:భూకంపాల నుంచి రక్షించే సుప్రీం రైలు