సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణ దిశగా చర్చలు జరుగుతుండగానే వాస్తవాధీన రేఖ వెంట సైనిక మోహరింపులు చేస్తోంది చైనా. సరిహద్దు వెంట సైనిక నిర్మాణాలు చేపడుతోంది. పాంగాంగ్ సరస్సు వద్దనున్న ఫింగర్లలో ఇప్పటికే పట్టును పెంచుకున్న చైనా.. సరిహద్దులోని ఇతర ప్రాంతాలకూ బలగాలను విస్తరిస్తోంది. మే 4 నుంచి ఇప్పటివరకు భారీ సంఖ్యలో శతఘ్నులు, సైనిక దళాలను సరిహద్దుకు తరలించింది.
'పాంగాంగ్ సో సరస్సు వెంట సైనిక కార్యకలాపాలను చైనా కొనసాగిస్తోంది. బలగాల తరలింపు, రక్షణ నిర్మాణాలు చేపడుతోంది' అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఫింగర్లపై పట్టుకు యత్నం..
పాంగాంగ్ సరస్సులోని ఫింగర్ 8 వరకు తమదేనని భారత్ చెబుతోంది. అయితే ఇటీవల జరిగిన సరిహద్దు ఘర్షణలో భారత జవాన్లను ఫింగర్ 4 దాటి పైకి వెళ్లకుండా అడ్డుకుంది చైనా సైన్యం. (పాంగాంగ్ సరస్సులో ముందుకు చొచ్చుకువెళ్లిన భూభాగాలను ఫింగర్లుగా వ్యవహరిస్తారు. ఇలా చొచ్చుకెళ్లిన భూభాగాలు సరస్సులో 8 ఉన్నాయి.) కొత్త ప్రాంతాలు, ఫింగర్లను తమ పరిధిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది చైనా. ఇందులో భాగంగానే దూకుడు విధానాలను అవలంబిస్తోంది.
కొనసాగుతున్న బలగాల తరలింపు..
గల్వాన్ వద్ద ఘర్షణ జరిగిన అనంతరమూ పలు సైనిక నిర్మాణాలను చైనా చేపట్టిందని సమాచారం. జూన్ 15, 16 రాత్రి.. భారత బలగాలు తొలగించిన సైనిక పోస్ట్‌లను కూడా పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా సైన్యం తిరిగి ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.
భారత గస్తీ యథాతథం..