ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు వినూత్న పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు ఒడిశాలోని ఖండగిరి మురికివాడల పిల్లలు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోబోలు, ఇతర వినూత్న ఉత్పత్తులు తయారుచేస్తూ కాలుష్య నివారణకు తమ వంతు కృషి చేస్తున్నారు.
ఖండగిరి మురికివాడల బాలలు ఇంజినీర్లు కాదు. కనీసం ఎలక్ట్రీషియన్లు కూడా కాదు. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానమూ లేదు. అయినప్పటికీ వారి చిన్ని మనస్సుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం కనుగొనాలనే ఒక ఆలోచన జనించింది. వెంటనే కార్యరంగంలోకి దిగిన బాలలు తమ మురికివాడ సమీపంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.
ప్లాస్టిక్ సీసాలు, వస్తువులు సేకరించి వాటితో రోబోలను తయారుచేశారు. ఇవి చూడడానికి హ్యూమనాయిడ్ రోబోల్లా ఉండటం విశేషం. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో గదులను శుభ్రంచేసే వాక్యూమ్ క్లీనర్స్ను, లాంతర్లను కూడా వారు రూపొందిస్తున్నారు. కొంతమంది స్వయంచాలకంగా తెరుచుకునే తలుపులు కూడా తయారుచేస్తున్నారు.