కొందరు విద్యార్థులు బడికి వెళ్లాలంటేనే భయపడిపోతారు. ఫలానా టీచర్ ఈ రోజు బడికి రాకపోతే బావుంటుందనుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ హోషంగాబాద్ జిల్లాలో రాధేశ్యాం రఘువంశి అనే ఉపాధ్యాయుడు రాకపోతే బడి బోసిపోతుందట. అందుకే పదవీ విరమణ పొంది బడి నుంచి వెళుతున్న ఈ మాస్టారుకు కన్నీటి వీడ్కోలు తెలిపారు విద్యార్థులు.
పాటతో ఏడ్పించేశారు..
సివ్నీమాల్వా తాలూకా.. చాప్డా గ్రామంలోని సర్కారు బడిలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన రఘువంశి ఇటీవల పదవీవిరమణ పొందారు. సన్మాన వేదికపై 'మీరు లేకపోతే ఈ బడి బోసిపోతుంది. మా చిన్ని మనస్సులు శూన్యంగా మారిపోతాయి. దయచేసి మీరు మాతోనే ఉండిపోండి గురువుగారు' అని ఏడుస్తూ విద్యార్థినిలు పాడిన పాటకు అక్కడున్నవారంతా కంటతడి పెట్టుకున్నారు.
ఇక బడి నుంచి ఇంటికి బయల్దేరిన రఘవంశిని కదలనీయకుండా గట్టిగా పట్టుకున్నారు విద్యార్థులు. గుండెలు పగిలేలా ఏడుస్తూ 'మీరు ఎక్కడికీ వెళ్లొద్దు మాస్టారు, మాతోనే ఉండాలి' అంటూ ప్రాధేయపడ్డ విధానం.. చూసినవారందరినీ కంటతడి పెట్టించింది.