దేశంలో పౌష్టికాహార సంక్షోభం ఎలా చిలవలు పలవలు వేసుకుపోయిందో, బాలభారతం ఎంతగా గుక్కపెడుతోందో సమగ్ర జాతీయ పోషకాహార అధ్యయన వివరాలు కళ్లకు కడుతున్నాయి. నవజాత శిశువులు మొదలు తొమ్మిదేళ్ల వరకు బాలలు, 10-19 ఏళ్ల మధ్య కౌమార దశలోనివారిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలు ‘యునిసెఫ్’ నిపుణుల తోడ్పాటుతో 2016 ఫిబ్రవరి, 2018 అక్టోబరు నడుమ నిర్వహించిన విస్తృత సర్వే ఎన్నో దిగ్భ్రాంతకర యథార్థాలను క్రోడీకరించింది. ముప్ఫై రాష్ట్రాలకు చెందిన సుమారు లక్షా 12 వేలమంది నుంచి రక్త, మూత్ర నమూనాలు రాబట్టి ఏ, బీ12, డీ విటమిన్లు, అయోడిన్, జింక్, ఫోలేట్, ఇనుపధాతు లోపాలపై చేపట్టిన భూరి కసరత్తు- రేపటి పౌరుల ఆరోగ్యచిత్రం ఛిద్రమవుతున్నట్లు నిర్ధారించింది.
అయిదేళ్లలోపు పిల్లల్లో 35 శాతం గిడసబారిపోతున్నట్లు, 17 శాతం బాలల్లో ఎత్తుకు తగ్గ బరువు కొరవడినట్లు తాజాగా వెల్లడైంది. బరువు తక్కువ పిల్లల జాబితాలో ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ ముందున్నాయి. బిహార్, మధ్యప్రదేశ్‌లతోపాటు యూపీ, రాజస్థాన్లలో ఎదుగుదల మందగించినవారి సంఖ్య అధికంగా ఉంది. అయిదు నుంచి పందొమ్మిదేళ్ల లోపువారిలో 10 శాతం, మధుమేహం దాపురించే ముప్పు ఎదుర్కొంటున్నారు. ఏడు శాతానికి పైగా పిల్లలు మూత్రపిండ వ్యాధుల పాలబడినట్లు, పలువురిని ఊబకాయం సమస్య పీడిస్తున్నట్లు చాటిన అధ్యయనం- ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.
2030నాటికి దేశంలో టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 10 కోట్లకు చేరుతుందన్న పాత అంచనాలను సరిదిద్దుకోవాల్సిన ప్రమాదాన్ని పోషకాహార సంక్షోభం సూచిస్తోంది. ఇప్పటికే క్షయ, మధుమేహం, గుండెజబ్బులు, కిడ్నీవ్యాధుల నివారణలో వెనకబాటు- ఆరోగ్యసూచీల్ని కుంగదీసి అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠకు తూట్లు పొడుస్తోంది. రేపటి పౌరుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు నేరుగా పూచీపడాల్సిన ప్రజాప్రభుత్వాలు తక్షణం మేలుకొనకపోతే, పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోతుంది!
అభివృద్ధి అజెండాలో పౌష్టికాహారానికి పెద్దపీట వేయాలంటూ ‘నీతి ఆయోగ్’ రెండేళ్ల క్రితం జాతీయ విధానాన్ని విడుదల చేసి, మౌలిక సమస్యల్ని ప్రస్తావించింది. 14-49 ఏళ్ల మహిళల్లో సగానికంటే ఎక్కువమందిని రక్తహీనత సమస్య పీడిస్తోంది. రక్షిత మంచినీరు కొరవడి పిల్లల్లో అధికులు డయేరియా, నులిపురుగుల బారిన పడుతున్నారు. పర్యవసానంగా పోషహాకార లోపాలు చుట్టుముడుతున్నట్లు అప్పట్లో నీతి ఆయోగ్ స్పష్టీకరించింది.
నేటికీ మధ్యప్రదేశ్‌లోని నాలుగేళ్లలోపు పిల్లల్లో 54 శాతం రక్తహీనతతో కృశిస్తుండటం- దిద్దుబాటు చర్యలు దస్త్రాలకే పరిమితమైన వైనాన్ని ధ్రువీకరిస్తోంది. జాతీయ సగటు లెక్కిస్తే- రెండేళ్లలోపు పిల్లల్లో కనీస సమతులాహారం పొందుతున్నవారు ఏడు శాతానికి మించరన్న నిర్ధారణ నిశ్చేష్టపరచేదే. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అసోం, ఝార్ఖండ్‌లు జాతీయ సగటుకన్నా మెరుగనిపించుకోగా- ఆంధ్రప్రదేశ్ (1.3శాతం), తెలంగాణ (3.6శాతం), మహారాష్ట్ర (2.2) వంటివి అధ్వాన రికార్డులు నమోదు చేశాయి. వెనకబాటుతనానికి మారుపేరుగా పరువుమాసిన ‘బిమారు’ (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ) రాష్ట్రాలే సకల బాలారిష్టాలకూ కేంద్ర బిందువులని నీతి ఆయోగ్ ఇటీవల సూటిగా తప్పుపట్టింది.