తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు దళాలకు కలపి.. ఒక్కడే 'మహా దళపతి'! - highset position in air force

భారత సైనిక, వైమానిక, నౌకా దళాలకు కలిపి ఒకే మహాదళపతి ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు త్రివిధ దళాలను ఏకతాటిపైకి తీసుకురాగల ధీరుడి అవసరం ఏమిటి ? ఇంతకీ దళాల మధ్య సమన్వయం బలపడాల్సిన ఆవశ్యకత ఏమిటి? ఆ మూడూ కలిస్తే రక్షణ వ్యవస్థ ఏమవుతుంది?

chief of defence staff (cds) is going to be appointed by indian security forces
మూడు దళాలాలక కలపి.. ఒక్కడే మహా దళపతి

By

Published : Dec 27, 2019, 7:50 AM IST

స్వీయ బలిమి ఎంతటిదైనా శత్రువును ఏ దశలోనూ తక్కువగా అంచనా వేయకూడదన్నది యుద్ధనీతిలో ప్రాథమిక సూత్రం. కనురెప్పపాటు కాలంలో లక్ష్యాలపై గురిపెట్టి ఆధునిక అస్త్ర ప్రయోగాలకు దేశదేశాలు సన్నద్ధమవుతున్న తరుణంలో ఎవరికైనా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని పోరాడే, క్షణాల్లో నిర్ణయాలు తీసుకోగల సుదృఢ రక్షణ వ్యవస్థ ప్రాణావసరం. ఈ దృష్టితోనే త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు ఇటీవలి ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ వెల్లడించారు.

త్రిదళ సమన్వయం..

సైన్యం, వైమానిక, నౌకా దళాలమధ్య మెరుగైన సమన్వయం సాధించడానికి ఉద్దేశించిన కీలక పదవి తాలూకు విధి నిషేధాలపై అజిత్‌ ధోవల్‌ కమిటీ నివేదిక చేతికందిన దరిమిలా- కేంద్ర మంత్రివర్గం తాజాగా పచ్చజెండా ఊపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై రక్షణమంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించనున్న మహాదళపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌- సీడీఎస్‌) కొలువు తీరాల్సిన ఆవశ్యకతను రెండు దశాబ్దాలక్రితం సుబ్రహ్మణ్యం కమిటీ ప్రస్తావించింది.

లాల్‌కృష్ణ అడ్వాణీ నేతృత్వంలోని మంత్రుల బృందం జాతీయ భద్రతా వ్యవస్థ తీరుతెన్నుల విశ్లేషణలో భాగంగా సీడీఎస్‌ అవతరణకు ఓటేసింది. ఆమధ్య షెకాత్కర్‌ కమిటీ సైతం అందుకు గట్టిగా మద్దతు పలికింది. రక్షణ మంత్రిగా మనోహర్‌ పారికర్‌ చొరవతో ఊపొచ్చిన ప్రతిపాదనకు మోదీ ప్రభుత్వం ఇప్పుడిలా ఆమోదముద్ర వేయడం ఎన్నో విధాల విశేష ప్రభావాన్వితం కానుంది. మానవ వనరుల గరిష్ఠ వినియోగానికి, త్రివిధ దళాల నడుమ అర్థవంతమైన సంతులనానికి దోహదకారి కానుందంటున్న దేశ మొదటి మహాదళపతి నియామకం, డీబీ షెకాత్కర్‌ మాటల్లో- ‘నలుగురు లఫె్టినెంట్‌ జనరళ్లు, ఇద్దరు ఎయిర్‌ మార్షళ్లు, ఇద్దరు వైస్‌ అడ్మిరళ్లు, ఎందరో బ్యురాక్రాట్ల తెరవెనక అవిరళ కృషి’కి ఫలశ్రుతి!

అవసరమేమిటంటే..

యాభై అయిదు భిన్నాంశాల ప్రాతిపదికన 130కి పైగా ఆధునిక సైనిక దళాల పాటవాన్ని మదింపు వేసి జీఎఫ్‌పీఐ (గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌) ఏటా ర్యాంకులు ప్రసాదిస్తుంటుంది. అందులో ఈ ఏడాది అమెరికా, రష్యా, చైనాల తరవాత నిలిచిన ఇండియా- ఫ్రాన్స్‌, జపాన్‌, దక్షిణ కొరియాలకన్నా మెరుగనిపించుకుంది.

దళాలవారీగా బలసంపన్నతను లెక్కకట్టి, మనపైకి కాలుదువ్వుతున్న ఫలానా దేశానికన్నా పైమెట్టు మీద ఉన్నామని సంతృప్తి చెందడానికి ఎంతమాత్రం వీల్లేని సంక్లిష్ట దశ ఇది! బంగ్లాదేశ్‌ విమోచన ఘట్టంలో భారత నౌకదళ, వాయుసేన అధిపతుల సన్నిహిత బంధం దేశానికి సాటిలేని విజయం సంపాదించి పెట్టింది. ఐబీ (ఇంటెలిజెన్స్‌ బ్యూరో), ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) మధ్య సమన్వయ రాహిత్యం, త్రివిధ దళాలను ఏకతాటిపై నడిపించే నాయకత్వ చొరవ కొరవడటం- కార్గిల్‌ పోరులో భారత్‌కు తల బొప్పి కట్టించింది. దళాల మధ్య సమన్వయం ఎంత మహత్తర పాత్ర పోషించగలదో దాదాపు అయిదు వందల సంవత్సరాల నాటి చారిత్రక ఘట్టం విశదీకరిస్తుంది. అప్పట్లో కేవలం పన్నెండువేల మందితో కూడిన బాబర్‌ దళం, లక్షమంది సైనికులు కలిగిన ఇబ్రహీం లోడీ సేనను మట్టి కరిపించింది!

సామర్థ్యం పెరగాలి...

యుద్ధ సన్నద్ధతకు, అది లేకుండా పోవడానికి ఎంత అంతరముందో ఆకళించుకున్న అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ సహా డెబ్భైవరకు దేశాల్లో సీడీఎస్‌ తరహా వ్యవస్థ ఇప్పటికే నెలకొని ఉంది. వర్తమాన, భావి సవాళ్లను దీటుగా ఎదుర్కోవాల్సిన భారత్‌- సైనిక బలగాల ఆధునికీకరణకు, దళాల గరిష్ఠ సద్వినియోగానికి విస్తృత ప్రాతిపదికన మార్పులు, చేర్పులు, సంస్కరణలు ఎన్నో చేపట్టాల్సి ఉంది. భిన్న దళాల అవసరాలు, సామర్థ్యాలు, పరిమితుల పట్ల కూలంకష అవగాహనతోనే అటువంటి కీలక ప్రక్రియను ఒక కొలిక్కి తేవాల్సిన దశలో- సీడీఎస్‌ నియామకం భారత రక్షణ ముఖచిత్రాన్ని ఏ మేరకు తేటపరచగలదో చూడాలి.

భారీ కమాండ్​ వ్యవస్థ

పొరుగున జన చైనా మూడేళ్లుగా సంస్థాగత సంస్కరణలు, సైనిక ఆధునికీకరణ వ్యూహాల్ని పట్టాలకు ఎక్కించి తన కమాండ్‌ వ్యవస్థను పెద్దయెత్తున ప్రక్షాళిస్తోంది. ఇటీవలి కాలంలో రష్యానుంచి సుఖోయ్‌ ఎస్‌యు-35 యుద్ధ విమానాలను, ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకున్న చైనా భూ, సముద్ర, గగనతలాల్లో నిపుణ పోరాటశక్తిగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. అదే ఇక్కడ యుద్ధ సామగ్రిలో 68శాతం కాలం చెల్లినవని, 24శాతం ప్రస్తుతానికి నడుస్తాయని, కేవలం ఎనిమిది శాతమే అత్యధునాతనమైనవన్న గణాంక వివరాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి.

త్రివిధ దళాలను ఏకతాటిపై నడిపించాల్సిన సీడీఎస్‌ ఆధునికీకరణ, శిక్షణ, ఉమ్మడి నిఘా, సంయుక్త దాడులు... వీటన్నింటికీ క్రియాశీల కేంద్ర బిందువై అన్నింటా చురుకు పుట్టించాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్మీలో ఏడు, వైమానిక దళంలో ఏడు, నేవీలో మూడు- మొత్తం పదిహేడు సింగిల్‌ సర్వీస్‌ కమాండ్లు కలిగిన భారత్‌ను శత్రుభీకరంగా మలచి మెరుపు వేగంతో విరుచుకుపడేలా కదం తొక్కించే పటిష్ఠ నిర్ణయ కేంద్రం అత్యవసరం.

సాధన సంపత్తి కొనుగోళ్లలో త్రివిధ దళాల ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించి, వెచ్చించే ప్రతి రూపాయీ సద్వినియోగమయ్యేలా కాచుకోవాలి. రవాణా, శిక్షణ, కమ్యూనికేషన్లు, నియామకాలు... తదితరాలన్నింటా వృథాను నివారించి, ఉమ్మడి తత్వాన్ని అలవరచగలిగితే- ఇటు ఖజానాపై అధిక భారం తగ్గుతుంది. అటు సైనిక దళాల పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుంది. సైన్యం ఎదుర్కొంటున్న యాభై రకాల సమస్యల్ని రెండేళ్ల క్రితమే ‘ఆర్మీ డిజైన్‌ బ్యూరో’ విపుల నివేదికలో పొందుపరచింది. ఇంతవరకు సత్వర స్పందనకు నోచుకోని అటువంటి అంశాలపై సీడీఎస్‌ పుణ్యమా అని వెలుగు ప్రసరిస్తే- త్రివిధ దళాల్ని శత్రు దుర్భేద్యం చేసేలా మరిన్ని లోతైన సంస్కరణలకు బాటలు పడతాయి!

ABOUT THE AUTHOR

...view details