సుప్రీంకోర్టులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ... ఆ పిటిషన్ను సీజేఐ పరిశీలనకు పంపారు. ఇవాళ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ విచారించే అవకాశం ఉంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా మధ్యంతర బెయిల్ కోరుతూ చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఫలితంగా చిదంబరాన్ని ఆరెస్టు చేయడానికి సీబీఐ, ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడం వల్ల నోటీసులు అంటించి వచ్చారు.
సుప్రీంను ఆశ్రయించిన చిదంబరం
చిదంబరం తరపు న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ వేసింది. కపిల్ సిబల్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది.