ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్పై బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం నేడు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా 106 రోజులుగా కస్టడీలో ఉన్న చిదంబరానికి బెయిల్ మంజూరు అయి నిన్న విముక్తి లభించింది. తిహార్ జైలు నుంచి విడుదలైనందుకు సంతోషం వ్యక్తం చేశారాయన. అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉన్నట్లు సోనియా తెలిపారు.
షరతులతో బెయిల్..
రూ.2 లక్షల బాండు, ఇద్దరి పూచీకత్తుపై చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని, సాక్షులతో సంప్రదింపులు జరపవద్దని ఆంక్షలు విధించింది. కేసుకు సంబంధించిన విషయాలు మీడియాతో మాట్లాడరాదని ఆజ్ఞాపించింది.