తెలంగాణ

telangana

ETV Bharat / bharat

177 బోగీలతో సూపర్ అనకొండ రైలు

భారత రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది. మూడు గూడ్స్ రైళ్లను జతచేసి ఒకే సర్వీసుగా విజయవంతంగా నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆగ్నేయ మధ్య రైల్వే. మొత్తం 177 బోగీలు, 15 వేల టన్నుల సరుకుతో ఉన్న ఈ రైలును బిలాస్​పుర్​- చక్రధర్​పుర్​ డివిజన్ల మధ్య నడిపారు.

three freight trains
సూపర్ అనకొండ రైలు

By

Published : Jul 1, 2020, 11:33 AM IST

భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్‌ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్‌పూర్ డివిజన్ ఆగ్నేయ మధ్య రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్‌ రైళ్లను జతచేసి నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

అనకొండ సర్వీసు..

లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్‌పుర్‌-చక్రధర్‌పూర్‌ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు వెల్లడించింది రైల్వే మంత్రిత్వ శాఖ. 15 వేల టన్నులకు పైగా సరకు, 177 బోగీలతో మూడు రైళ్లను అనకొండను పోలినట్టుగా నడిపించినట్లు తెలిపింది. గూడ్స్‌ రైలు సర్వీసుల రవాణా సమయాన్ని తగ్గించేందుకే ఈ వినూత్న ప్రయోగం చేపట్టినట్లు పేర్కొంది.

గూడ్స్ రైళ్లు యథాతథమే..

కరోనా సంక్షోభ సమయంలో ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర సామగ్రిని తరలించడంపై రైల్వే శాఖ దృష్టి పెట్టిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల వెల్లడించారు. శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపారు. రైల్వేశాఖ దేశంలో ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్‌ రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి:ముంబయిలో స్థానిక రైళ్ల సేవల విస్తరణ.. వారికే అనుమతి

ABOUT THE AUTHOR

...view details