చెట్ల పరిరక్షణ కోసం అంబులెన్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ వ్యక్తి. చెట్ల పరిరక్షణ కోసం ఓ అంబులెన్స్‌ను ఏర్పాటుచేశాడు. విత్తనాలు, మొక్కల పంపిణీ, నాటడంలో సహాయం, చెట్లను తరలించడం, సర్వే చేయడం, చనిపోయిన వృక్షాలను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపడతారు ఈ అంబులెన్స్‌లోని సిబ్బంది.
"అనారోగ్యంతో ఉన్న చెట్ల సంరక్షణ, నేలకూలిన చెట్లకు సహాయమందించడం ఈ చెట్టు అంబులెన్స్ లక్ష్యం. 2020 కల్లా దేశంలోని జిల్లాకో చెట్టు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం."
-అబ్దుల్ ఘనీ, ట్రీ అంబులెన్స్ సేవల వ్యవస్థాపకుడు
వార్దా, గాజా తుపానుల కారణంగా తమిళనాడులోని అనేక చెట్లు నేలకూలి వేర్లు బయటకు వచ్చాయన్నారు చెట్టు అంబులెన్స్ సంస్థ అధ్యక్షుడు సురేశ్. 2015లో చెన్నై వరదలను దగ్గరనుంచి చూశానని వెల్లడించారు. ఈ కారణంగానే చెన్నైలో చెట్టు అంబులెన్స్ నడపాలనే అబ్దుల్ ఘనీ ఆలోచనకు మద్దతిచ్చానని తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా చెట్టు అంబులెన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ అంబులెన్స్‌లో పెద్ద వృక్షాలను వేర్లతో బయటకు తీసే హైడ్రాలిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
ఉపరాష్ట్రపతిచే ఆరంభం
ఈ చెట్టు అంబులెన్స్‌ను ఈ ఏడాది మే 22న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.