కరోనా మహమ్మారి కారణంగా వైద్య ప్రపంచానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు వైద్య నిపుణులు. చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు 39 ఏళ్ల ఓ రోగికి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయిన క్రమంలో ఆసుపత్రిలో చేరిన రోగి.. 46 రోజుల పాటు ఎక్స్ట్రా కార్పోరీల్ మెంబ్రాన్స్ ఆక్సిజనేషన్(ఈసీఎంఓ) సాయంతో కాలం వెళ్లదీశాడు. ఊపిరితిత్తుల దాత దొరికిన క్రమంలో జులై 29న ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. అనంతరం కోలుకున్న నేపథ్యంలో ఆగస్టు 27న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
ప్రస్తుత కరోనా సంక్షోభం సమయంలో రెండు ఊపిరితిత్తులు ఒకేసారి మార్చటం అద్భుతమైన విజయమని కొనియాడారు అపోలో ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి. అధునాత సాంకేతికత, వైద్య నిపుణులతోనే ఇది సాధ్యమైందన్నారు. అవయవ మార్పిడిలో ఎన్నో కీలక మైలురాళ్లను అందుకున్నట్లు చెప్పారు. దేశంతో పాటు అంతర్జాతీయంగా లీడర్‌గా ఎదిగేందుకు తాము కృషి చేస్తామన్నారు. దేశంలో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల్లో తాము 90 శాతం విజయవంతమైనట్లు చెప్పారు. అపోలో ఆసుపత్రి అవయవ మార్పిడి కేంద్రం.. దేశం నుంచి మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు నాణ్యమైనదిగా పేరుగాంచినట్లు తెలిపారు.
చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇప్పటి వరకు 120 మందికి 220 అవయవాల మార్పిడి చేశారు. అందులో 69 గుండె, 151 ఊపిరితిత్తులు ఉన్నాయి. 1994లో మానవ అవయవాల మార్పిడి చట్టం తీసుకొచ్చిన తర్వాత తొలిసారి 1995లో గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.
ఇదీ చూడండి:ఆవు-దూడకు 'మహా' పోలీసుల డీఎన్ఏ పరీక్ష