తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌర చట్టంలో స్వల్ప మార్పులతో ఆందోళనలకు చెక్​! - జాతీయ వార్తలు తెలుగులో

పౌరసత్వ సవరణ చట్టంపై కారాలూ మిరియాలూ నూరుతున్న భాజాపాయేతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు ఎన్​పీఆర్​ కసరత్తుకూ సహకరించేది లేదని రుసరుసలాడుతున్నాయి. అయితే... 2010లో తొలిసారి ఎన్‌పీఆర్‌ చేపట్టినప్పుడు కానరాని ప్రజాందోళన ఇప్పుడింతగా ఎందుకు పురివిప్పిందో కేంద్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి! ఏమాత్రం తేడా లేకుండా గతంలో మాదిరిగానే ఎన్‌పీఆర్‌ నిమిత్తం సమాచార సేకరణ జరపనున్నట్లు సచివులు చెబుతున్నా- లోగడకంటే, ఎనిమిది కొత్త విషయాల కూర్పును తాజా ఎన్‌పీఆర్‌ నిర్దేశిస్తోంది.

check-for-concerns-with-slight-changes-in-civil-law
పౌర చట్టంలో స్వల్ప మార్పులతో ఆందోళనలకు చెక్​!

By

Published : Jan 20, 2020, 6:48 AM IST

పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ రేగిన ఆందోళనల ప్రభావం- జనగణన (సెన్సెస్‌)కు ముందు చేపట్టే ఇళ్ల నమోదు ప్రక్రియ మీద, జాతీయ జనాభా పట్టిక మీదా గట్టిగానే ప్రసరిస్తోంది. దాదాపు రూ.8,754 కోట్లతో జనగణన, సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు కేంద్ర మంత్రివర్గం నిరుడు డిసెంబరు చివరివారంలోనే ఆమోద ముద్ర వేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై కారాలూ మిరియాలూ నూరుతున్న భాజాపాయేతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) కసరత్తుకూ సహకరించేది లేదని రుసరుసలాడుతున్నాయి.

భరోసా కల్పించినా..

జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) రూపొందించే క్రమంలో మొదటి మెట్టుగా ఎన్‌పీఆర్‌ను కేంద్రం సిద్ధం చేస్తోందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమానిస్తున్నాయి. ‘ఇస్‌కాదుర్‌ దుర్‌ తక్‌ ఎన్‌ఆర్‌సీసే కుచ్‌ భీ సంబంధ్‌ నహీ హై’ (ఎన్‌ఆర్‌సీకి దీనికీ ఎలాంటి సంబంధమూ లేదు) అని స్పష్టీకరించిన కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌- ‘ఎలాంటి రుజువులు, పత్రాలు, వేలిముద్రలు’ లేకుండానే ఎన్‌పీఆర్‌ వివరాల సేకరణ జరుగుతుందని అభయమిస్తున్నారు.

అభ్యంతరాలెన్నో...

వచ్చే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరుదాకా జరిగే ఈ జనాభా సమాచార సేకరణ మహా క్రతువు విధి విధానాలపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సదస్సు సందర్భంగా రాష్ట్రాలు కొన్ని అభ్యంతరాల్ని లేవనెత్తాయి. ఈసారి ఎన్‌పీఆర్‌లో ‘తల్లిదండ్రులు ఎక్కడ జన్మించా’రన్న ప్రశ్న కొత్తగా వచ్చి చేరింది. ‘తాము ఎక్కడ పుట్టిందీ కచ్చితంగా చెప్పలేని ఎంతోమంది ఉన్న దేశంలో, వాళ్ల తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశం ఏదన్న ప్రశ్న ద్వారా ఏం సాధించదలచిందీ అగమ్యం’ అంటూ రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాలు దాన్ని తొలగించాలని కోరాయి. అలాంటి ప్రశ్నలకు పౌరులు కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పని లేదని కేంద్రం భరోసా ఇస్తున్నా- అసలు ఎన్‌పీఆర్‌ రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో వ్యాజ్యాలూ దాఖలయ్యాయి. 2010లో తొలిసారి ఎన్‌పీఆర్‌ చేపట్టినప్పుడు కానరాని ప్రజాందోళన ఇప్పుడింతగా ఎందుకు పురివిప్పిందో కేంద్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి!

కొత్త ప్రశ్నలతోనే చిక్కు....

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రేపు చేపట్టబోయే జనగణన ఎనిమిదోది కాగా, ఎన్‌పీఆర్‌ కూర్పు రెండోది. దేశవ్యాప్తంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరి సమగ్ర గుర్తింపు సమాచార నిధిని నిక్షిప్తం చెయ్యడానికే ఎన్‌పీఆర్‌ను యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఏమాత్రం తేడా లేకుండా గతంలో మాదిరిగానే ఎన్‌పీఆర్‌ నిమిత్తం సమాచార సేకరణ జరపనున్నట్లు సచివులు చెబుతున్నా- లోగడకంటే, ఎనిమిది కొత్త విషయాల కూర్పును తాజా ఎన్‌పీఆర్‌ నిర్దేశిస్తోంది. ఆధార్‌, మొబైల్‌, పాస్‌పోర్ట్‌, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, శాశ్వత ఖాతా సంఖ్య నెంబర్లతోపాటు ‘ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు?’ వంటి ప్రశ్నల్నీ కొత్తగా జోడించారు.

ప్రతి ఒక్కరినుంచి ఇంతగా గుచ్చిగుచ్చి వివరాలు సేకరించేది ఎన్‌పీఆర్‌ కోసం మాత్రమే కాదని, దానినుంచి జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) రూపొందించడమే సర్కారు లక్ష్యమనీ పలు ప్రభుత్వాలు, ప్రజా సంఘాలూ అభిప్రాయపడుతున్నాయి. 2003 డిసెంబరునాటి పౌరసత్వ నిబంధనలు- ఎన్‌పీఆర్‌లోని ప్రతి వ్యక్తి, కుటుంబం వెల్లడించిన వివరాల్ని స్థానిక రిజిస్ట్రార్‌ పరిశీలిస్తారని, ఆ క్రమంలో ఎవరి పౌరసత్వమైనా సందేహాస్పదమైనప్పుడు మరింత దర్యాప్తుకోరుతూ ఆ సంగతే నమోదు చేస్తారనీ చెబుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రెండే పర్యాయాలు ఎన్‌ఆర్‌సీ రూపకల్పన జరిగినా ఆ రెండూ అసోంకే పరిమితమయ్యాయి. సుప్రీం పర్యవేక్షణలో సాగిన అక్కడి ఎన్‌ఆర్‌సీ ఎంత అధ్వాన్నంగా జరిగి ఎన్ని లక్షలమంది ఉసురుపోసుకుందో తెలియంది కాదు. ఆ తరహా బాగోతమే దేశవ్యాప్తమవుతుందన్న నిరసన గళాల ఆవేదనలో అనౌచిత్యం లేనేలేదు!

పౌరసత్వానికి రాచబాటలు...

అసోం ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కక అక్రమ వలసదారులుగా మిగిలి పొగులుతున్న 19 లక్షలమందికిపైగా అభాగ్యుల్లో మెజారిటీ హిందువులేనని తేటపడటంతో కమలనాథులే ఆ కసరత్తును తృణీకరించారు. హుటాహుటిన పౌరసత్వ చట్టాన్ని సవరించి, పొరుగున మూడు దేశాలనుంచి మతపీడన వెతలతో పారిపోయి వచ్చిన ఆరు మతాలకు చెందినవారికి పౌరసత్వం ఇచ్చేందుకు రాచబాటలు పరిచారు. ఆ సవరణ చట్టం పౌరసత్వం ఇచ్చేందుకే కాని, ఎవరిదీ రద్దు చేసేందుకు కాదని భాజపా నేతలు చెబుతున్నా- ఔదార్యం పరిధినుంచి ముస్లిములను మినహాయించడమే దేశవ్యాప్త ఆందోళనలకు మూలహేతువు!

అక్రమ వలసలు, చొరబాట్లు దేశభద్రతకే తూట్లు పొడుస్తున్నాయంటూ పౌరులకు బహుళార్థ సాధక గుర్తింపు కార్డుల వ్యవస్థ వేరూనుకోవాలని రెండో పరిపాలన సంస్కరణల సంఘం 2009లోనే ప్రతిపాదించింది. 2003నాటి పౌరసత్వ నిబంధనలు ఎన్‌ఆర్‌సీ, గుర్తింపు కార్డుల జారీని ప్రస్తావించాయి. ఈ మౌలిక లక్ష్యాలు ఉన్నతమైనవే అయినా, పౌరసత్వ సవరణ చట్టంలో కేంద్రం కనబరచిన ‘బంతిలో వలపక్షం’- ఎన్‌పీఆర్‌ కూర్పునూ పలు రాష్ట్రాలు వ్యతిరేకించేందుకు కారణమవుతోంది. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ అని లోగడ నినదించిన మోదీ ప్రభుత్వం- సబ్‌కా విశ్వాస్‌ను వాటికి ఇటీవల జతచేర్చింది. ఆ విశ్వాస పునరుద్ధరణే ఇప్పుడు జరగాలి. పౌరసత్వ సవరణ చట్టంలో కొద్దిపాటి మార్పులకు సిద్ధపడితే ఆందోళనలు సమసిపోవడమే కాదు, జనగణన, ఎన్‌పీఆర్‌లపై ముసిరిన వివాదాలూ తెలిమబ్బుల్లా తేలిపోతాయి!

ABOUT THE AUTHOR

...view details