బ్రిటీష్ పాలకులపై 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. కానీ, అదే ఏడాది ప్రారంభంలో 'చపాతి ఉద్యమం' ఊపందుకుంది. ఎవరు ప్రారంభించారో.. ఎందుకు ప్రారంభించారో తెలియదు గానీ దేశంలోని ప్రతి గ్రామంలో చపాతీల పంపిణీ ఒక ఉద్యమంలా కొనసాగింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ వ్యక్తి గ్రామంలోని కాపలాదారుడికి కొన్ని చపాతీలు ఇచ్చి.. వాటిని ఊర్లో పంచమని, మరికొన్ని చపాతీలు చేసి మరికొందరికి పంపిణీ చేయమని చెప్పాడట. ఆ కాపలాదారుడు అలాగే చేయడంతో ఉత్తర భారతదేశంలో మొదలైన ఈ చపాతీల పంపిణీ ఓ ఉద్యమంలా దేశవ్యాప్తంగా విస్తరించింది. బ్రిటీష్ అధీనంలో ఉండే ప్రతి పోలీస్‌స్టేషన్‌కి చపాతీలు వెళ్లేవట.
1857 ఫిబ్రవరిలో తొలిసారి ఈ చపాతీల తంతు గురించి మథురలోని బ్రిటీష్ అధికారి థోర్న్‌హిల్‌కి తెలిసింది. తన కార్యాలయంలో ఓ పోలీసు ఆఫీసర్ తెచ్చిపెట్టాడని, వాటిని ఆ ఊరిలో కాపలాదారుడు ఆ పోలీస్‌కు ఇచ్చాడని తెలుసుకున్నాడు. దీనిపై విచారణ జరపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయట. రాత్రుళ్లు గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి చపాతీలు పంచుతున్నారని, ఆ చపాతీలు రాత్రికిరాత్రే వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని తెలిసింది.