జాబిలికి మరింత చేరువగా చంద్రయాన్-2 జాబిల్లికి చంద్రయాన్-2 వ్యోమనౌక మరింత దగ్గరయింది. నాలుగోసారి కక్ష్య పెంపు ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3.27 గంటలకు కక్ష్యను పెంచినట్లు ఇస్రో అధికారికంగా వెల్లడించింది. వ్యోమనౌక పారామితులు అంచనాలకు తగినట్లే ఉన్నాయని తెలిపారు.
'ఆన్‌బోర్డు ప్రొపల్షన్' వ్యవస్థను ఉపయోగించి చంద్రయాన్- 2 వాహకనౌకను 277 x 89472 కిలోమీటర్ల కక్ష్యలోకి మార్చారు. ఆన్‌బోర్డులో ఉన్న ఇంధనాన్ని 646 సెకన్ల పాటు మండించడం ద్వారా ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆగస్టు 6న అయిదోసారి..
మూడు సార్లు.. జులై 24, 26, 29 తేదీల్లో చంద్రయాన్-2 కక్ష్యను పెంచారు. తాజాగా చంద్రయాన్-2 జాబిల్లికి మరింత చేరువైందని ఇస్రో తెలిపింది. అయిదో సారి కక్ష్య పెంపు ప్రక్రియను ఆగస్టు 6న మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల మధ్య చేపట్టనున్నట్లు వెల్లడించింది.
భారత అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఈ నెల 22న ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2ను మోసుకుంటూ జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం1 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.
చంద్రయాన్-2’లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు పరికరాలు ఉన్నాయి. పరిశోధనల కోసం వీటిలో 13 పేలోడ్స్‌ను శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ ఏడాది సెప్టెంబరు 7న చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి 14 రోజులు పాటు (ఒక లూనార్ పగలు) పరిశోధనలు జరుపుతుంది.
ఇదీ చూడండి: విజయం: చంద్రయాన్-2 ఆరంభం మాత్రమే..