చంద్రునిపైకి భారత్ పంపిన రెండో మిషన్.. చంద్రయాన్-2. జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌తో భారత్‌ను... రష్యా, అమెరికా, చైనా సరసన నిలిపే ప్రయోగం ఇది. అయితే చంద్రయాన్-2 ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఇది ఒకటే కారణం కాదు.
చంద్రయాన్-2 మిషన్ ఖర్చు రూ. 978 కోట్లు. ఇందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, చోదనం, క్షేత్ర స్థాయి నెట్‌వర్క్‌కు రూ. 603 కోట్లు ఖర్చయ్యాయి. స్వదేశీ క్రయోజినిక్ ఇంజిన్ గల జీఎస్ఎల్వీ మార్క్3 భారీ వాహకనౌకకు రూ. 375 కోట్ల వ్యయం అయింది.
ఇలా మొత్తం 142 మిలియన్ డాలర్లతో అంటే రూ. 978 కోట్లతో పూర్తయిన చంద్రయాన్-2 ఎన్నో సూపర్‌హిట్ హాలీవుడ్ చిత్రాల కన్నా చాలా తక్కువ బడ్జెట్ ప్రాజెక్ట్.
ఇటీవల విడుదలైన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' చిత్రం 356 మిలియన్ డాలర్లు అంటే రూ. 2,443 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇది చంద్రయాన్-2 బడ్జెట్ కన్నా రెండు రెట్లు ఎక్కువ.
హాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమైన 'అవతార్'కు 478 మిలియన్ డాలర్లు అంటే రూ. 3,282 కోట్లు ఖర్చయ్యాయి.