తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2: ప్రగ్యాన్​కు నడకనేర్పిన గ్రామాలు - సీతంపూండి

చంద్రయాన్​-2 రోవర్​కు నడక నేర్పిన తమిళనాడులోని సీతంపూండి, కన్నామలై గ్రామాలు.. వ్యోమనౌక ల్యాండింగ్​ కోసం  ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. వ్యోమనౌకకు ఈ రెండు గ్రామాల మధ్య అనుబంధం అలాంటిది మరి.

చంద్రయాన్​-2: ప్రజ్ఞాన్​కు నడకనేర్పిన గ్రామాలు

By

Published : Sep 6, 2019, 6:31 AM IST

Updated : Sep 29, 2019, 2:51 PM IST

చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌-2 వ్యోమనౌక దిగే క్షణాల కోసం యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమిళనాడులోని ఆ రెండు గ్రామాల్లో ఆ ఆత్రుత ఇంకా ఎక్కువగా ఉంది. చంద్రయాన్‌-2తో ఆ ఊళ్లకు ఉన్న అనుబంధం ఎలాంటిదంటే వ్యోమనౌకలోని ల్యాండర్‌, రోవర్‌కు అవి నడకనేర్పాయి.

చంద్రుని ఉపరితలానికి భూగ్రహంపై ఉండే నేలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. చంద్రయాన్‌-2 వ్యోమనౌకలోని ల్యాండర్‌ కాళ్లు చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగేలా రోవర్‌లోని చక్రాలు ముందుకు సాగేలా చూడాలి. అందుకోసం విస్తృతంగా పరీక్షలు జరపటానికి జాబిల్లి ఉపరితలాన్ని కృత్రిమంగా సృష్టించాల్సి వచ్చింది.

అమెరికా డిమాండ్​తో ప్రత్యామ్నాయాలు​

అందుకు అవసరమైన మట్టి ఇస్రో వద్ద లేదు. అమెరికా వద్ద ఉన్నప్పటికీ పెద్ద మొత్తం డబ్బును డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై ఇస్రో దృష్టి సారించింది. చంద్రుడి ఉపరితలాన్ని పోలిన మట్టికోసం భూగర్భ శాస్త్రవేత్తల సాయం తీసుకుంది. చంద్రుడిపై బసాల్టిక్‌, ఆంత్రోసైట్‌ శిలలు ఉంటాయి.

ఆ రెండు గ్రామాల్లో..

తమిళనాడులోని సేలంకు 65 కిలోమీటర్ల దూరంలోని సీతంపూండి, కున్నామలై గ్రామాల్లో ఆంత్రోసైట్‌ శిలలు ఉన్నట్లు గుర్తించారు. అలాంటి శిలలను మహారాష్ట్రలోనూ కనుగొన్నారు. ఆ గ్రామాల నుంచి సేకరించిన శిలలను చంద్రునిపై ఉండే మట్టి పరిమాణంలో పిండి చేశారు. శిలారేణువుల పరిమాణం 30 నుంచి 200 మైక్రాన్లు ఉండేలా పిండి చేశారు.

బెంగళూరులో..

ఆ మిశ్రమాన్ని బెంగళూరులోని 'లూనార్‌ టెరైన్‌ టెస్ట్‌ ఫెసిలిటీ'కి తీసుకెళ్లి కృత్రిమంగా చందమామ ఉపరితలాన్ని సృష్టించారు. అక్కడ చంద్రయాన్‌-2లోని ల్యాండర్‌, రోవర్లను పరీక్షించారు. భూమితో పోలిస్తే చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతు మాత్రమే ఉంటుంది. అలాంటి వాతావరణం కోసం రోవర్‌ను హీలియంతో నిండిన బెలూన్‌తో కొంతమేర పైకి లేపారు. ఈ ప్రయోగాలు ఇస్రోకు కలిసి వచ్చాయి.

4 నుంచి 6 చక్రాలు

తొలుత రోవర్‌కు 4 చక్రాలనే అమర్చాలని భావించింది ఇస్రో. ఈ పరీక్షల్లో ఎదురైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చక్రాల సంఖ్యను 6కు పెంచింది.

జాబిల్లిపై ఉండే మట్టికోసం ఇస్రో 25 కోట్లు కేటాయించింది. వాస్తవంగా అయిన ఖర్చు చాలా తక్కువ. ఎందుకంటే ఆ మట్టిని తయారు చేసేందుకు సహకరించిన అనేక సంస్థలు పైసా తీసుకోలేదు. ఈ విధంగా చంద్రయాన్‌-2 ప్రయోగానికి ఉపయోగించిన వ్యోమనౌకలోని ల్యాండర్‌, రోవర్‌కు తమిళనాడులోని సీతంపూండి, కున్నామలై గ్రామాలు నకడనేర్పాయి.

ఇదీ చూడండి:'ల్యాండర్​ పని 14 రోజులే.. ఆర్బిటర్​ది ఏడాది'

Last Updated : Sep 29, 2019, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details