చంద్రుని ఉపరితలంపై దిగే క్రమంలో చంద్రయాన్-2 ల్యాండర్ 'విక్రమ్' ఎదుర్కొన్న సమస్యలను ఇస్రో సమీక్షిస్తోంది. ఇందుకోసం జాబిల్లిపై ల్యాండర్ సాఫీగా దిగేందుకు తాను వేసిన అంచనాల్లో వైరుధ్యాలను నిగ్గుతేల్చాలని నిర్ణయించింది. భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోవడానికి ముందు విక్రమ్ పంపిన డేటాను పరిశీలిస్తోంది.
డేటా ఆధారంగా
విక్రమ్ పంపిన డేటా ఆధారంగా ఊహాజనిత కారణాలను అన్వయించుకుంటూ.. పలు సిమ్యులేషన్లను ఇస్రో రూపొందించనుంది. దీని ద్వారా విక్రమ్‌లో తలెత్తిన లోపాలను నిర్దిష్టంగా గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. ప్రయోగానికి ముందు నిర్వహించిన ఏదైనా సిమ్యులేషన్ను.. ఆ తరువాత విస్మరించామా లేక పరీక్షల సమయంలో తలెత్తిన ఏదైనా వైరుధ్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదా అన్నది పరిశీలించనుంది.